ఇక చెన్నైలో స్థిర‌ప‌డుతాను :శ్రీరెడ్డి

I'm going to settle in Chennai : Sri Reddy
Saturday, July 21, 2018 - 23:30

మొన్న‌టి వ‌ర‌కు టాలీవుడ్‌లోనూ, హైద‌రాబాద్‌లోనూ తెగ హంగామా చేసిన శ్రీరెడ్డిని ఇపుడు తెలుగు మీడియా వ‌దిలేసింది. ప‌వ‌ర్‌స్టార్ ని ఆమె తిట్ట‌డం, ఛానెల్స్‌లో ఆ బీఫ్డ్ మాట రావ‌డం, ప‌వ‌ర్‌స్టార్ ఫైర్ కావ‌డం, ఈ విష‌యంలో సాధార‌ణ ప్ర‌జానీకం కూడా ప‌వ‌న్‌కే మ‌ద్ద‌తుగా నిల‌వ‌డంతో... శ్రీరెడ్డి విష‌యంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా వెన‌క‌డుగు వేసింది. ఇక విధంగా చెప్పాలంటే అప్ర‌క‌టిత నిషేధాన్ని విధించింది. ఏ ఛానెల్ కూడా శ్రీరెడ్డిని స్టూడియోకి ఆహ్వానించ‌డం లేదు. అస‌లు ఆమె వార్త‌ల‌నే ప్ర‌సారం చేయ‌డం లేదు. 

ఇపుడు ఆమె హంగామా అంతా ఫేస్‌బుక్‌కే ప‌రిమిత‌మైంది. తిరిగే కాలు, వాగే నోరు ఆగ‌ద‌న్న‌ట్లు.. ఎపుడూ ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌క‌పోతే ఏమీ తోచ‌ని ఈ ఆర్టిస్ట్ ఇపుడు త‌న దృష్టిని కోలీవుడ్‌పై పెట్టింది. చెన్నైలో డ్రామా మొద‌లుపెట్టింది. అక్క‌డి యూట్యూబ్ ఛానెల్స్‌ని త‌నే పిల‌వ‌డం. త‌న‌కి తెలిసిన ప‌ద్ద‌తిలో బోల్డ్‌గా మాట్లాడ‌డం, ఆరోప‌ణలు చేయ‌డం వంటివి షురూ చేసింది. దాంతో త‌మిళ యూట్యూబ్ ఛానెల్స్‌కి కొంత స‌రుకు దొరికిందిపుడు.

స‌రిగ్గా తెలుగులో ఏమి చేసిందో త‌మిళంలోనూ అదే చేస్తుంది. అమ్మ (జ‌య‌లలిత‌) బ‌తికుంటే అంద‌రి తాటా తీసేద‌నీ, త‌మిళ న‌టీన‌టుల సంఘం త‌న‌లాంటి వారివైపు నిలుచుంటుందా లేక బ్రోక‌ర్ల వైపా అని స్టేట్‌మెంట్లు ఇవ్వ‌డం చేస్తోంది. ఐతే ఇదంతా ఆమె డ్రామా అని అంద‌రికీ తెలిసిపోతూనే ఉంది.

తాజాగా ఒక త‌మిళ యూట్యూబ్ చానెల్‌కిచ్చిన ఇంట‌ర్వ్యూలో ఇక తాను తెలుగునాట విసిగిపోయాన‌ని, చెన్నైలోనే స్ఙిర‌ప‌డుతాన‌ని చెప్పింది. ఆ వీడియోని ఆమె త‌న ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసుకొంది. దాంతో అంద‌రూ పీడ విర‌గ‌డైపోతుంది... ఆ ప‌ని చెయ్యి అంటూ ఆమెకి రిప్ల‌యిలు కొడుతున్నారు.