క‌త్తి కేసీఆర్ వైపు తిరిగింది!

Kathi Mahesh makes strong comments on KCR
Wednesday, January 17, 2018 - 18:00

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని టార్గెట్ చేసి వార్త‌ల్లో నిలిచిన క్రిటిక్ క‌త్తి మ‌హేష్ ఇపుడు త‌న విమ‌ర్శ‌ల క‌త్తిని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వైపు తిప్పారు. జైల్లో ఉన్న ఎమ్మార్పీఎస్ నాయ‌కుడు మందకృష్ణ మాదిగ‌ని ద‌ళిత యువ సంచ‌ల‌నం, గుజ‌రాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీతో క‌లిసారు. మంద‌కృష్ణ‌కి జిగ్నేష్ త‌న మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత మాట్లాడిన క‌త్తి మ‌హేష్‌..కేసీఆర్ మీద విమ‌ర్శ‌లు చేయ‌డం అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

తెలంగాణ‌లో కేసీఆర్ పై తిరుగుబాటు తప్పదు. అప్రజాస్వామిక శక్తులు రాష్ట్రంలో రాజ్యమేలుతున్నాయి, అని క‌త్తి మ‌హేష్ మీడియా ముందు కేసీఆర్‌కి వ్య‌తిరేకంగా విమ‌ర్శ‌లు చేశారు. చిత్తూరు/నెల్లూరుకి చెందిన క‌త్తి మ‌హేష్‌కి తెలంగాణకి చెందిన మేధావులు కొంద‌రు కొంత‌కాలంగా మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. వారంతా కేసీఆర్‌కి హార్డ్‌కోరు అభిమానులు. మ‌రి ఇపుడు ఈ స్టేట్‌మెంట్స్ త‌ర్వాత కూడా వారు క‌త్తికి మ‌ద్ద‌తు ఇస్తారా అనేది చూడాలి.

ప‌వ‌ర్‌స్టార్‌ని తిట్టి జ‌నం దృష్టిలో ప‌డ్డ క‌త్తి మ‌హేష్ ఇపుడు కొండ‌ని ఢీకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కేసీఆర్ ముందు మ‌హామ‌హుల ప‌ప్పులే ఉడ‌క‌లేదు. మ‌రి క‌త్తి ఎలా నిల‌బ‌డాడుతాడో చూడాలి. మ‌రోవైపు, క‌త్తి ఇదే రూట్లో కేసీఆర్ పై విమ‌ర్శ‌లు చేస్తే ఇక ప‌వ‌ర్‌స్టార్‌, ఆయ‌న అభిమానులు హాయిగా ఊపిరి పీల్చుకోవ‌చ్చు. ఎందుకంటే ఇక‌ కాగల కార్యాన్ని గంధ‌ర్వులే తీరుస్తారు. ఎలాంటి విమ‌ర్శ‌ల‌నైనా తిప్పికొట్టే వాగ్ధాటి టీఆర్ ఎస్‌లో సామాన్య కార్య‌క‌ర్త‌ల‌కి కూడా ఉంటుంది.