ట్యాంక్‌బండ్‌పై సినారె విగ్ర‌హం: కేసీఆర్‌

KCR says C Narayana Reddy's statue will be installed at Tank Bund
Tuesday, June 13, 2017 - 15:45

ప్రముఖ కవి, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ సి.నారాయణ రెడ్డికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఘన నివాళి అర్పించారు. మంగళవారం సినారె ఇంటికి వెళ్లి ఆయన పార్దీవదేహంపై పుష్పగుచ్చం ఉంచి, నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబ సభ్యులందరితో ప్రత్యేకంగా మాట్లాడారు. 

"తెలంగాణ రాష్ట్రం గర్వంగా తల ఎత్తుకుని సినారె మా బిడ్డ అని చెప్పుకునేటంతటి మహానీయుడు. గొప్ప కీర్తి శిఖరాలను అధిరోహించినటువంటి విశిష్టమైన సాహితీవేత్త. కవులు, రచయితలు చాలా మంది ఉంటరు కానీ, సినారె సభ అంటే సినారె మాట అంటే ఓ గ్లామర్. కవులకు గ్లామర్ ఉంటుందని నిరూపించిన వ్యక్తి సినారె. ఉపన్యాసం వినాలనే ఉత్సాహంతో వందలాదిగా సభలో పాల్గొనేవారు. ఆయన పుట్టింది తెలంగాణ గడ్డయినప్పటికీ, మొత్తం తెలుగు ప్రజలు గర్వంగా చెప్పుకోనేటటువంటి వ్యక్తి. ఆది ప్రాసలకు అంత్య ప్రాసలకు అద్భుతమైన నడక నేర్పడంలో వారికి వారే సాటి. సినారెకు ఎవరూ పోటీలేర"న్నారు సీఎం కేసీఆర్‌.

"సినారె గారి స్మారక భవనానికి నగరం నడిబొడ్డున స్థలం కేటాయించి స్మారక మ్యూజియంతో పాటు సాహితి సమాలోచనలు జరుపుకునే విధంగా సమావేశ మందిరాన్ని కూడా వారి పేరిట ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓ ప్రముఖ సంస్థకు సినారె గారి పేరు చిరస్థాయిగా ఉండేలా పెట్టుకుంటాం. ట్యాంక్ బండ్ తో పాటు కరీంనగర్ పట్టణంలోనూ, సిరిసిల్ల జిల్లా కేంద్రంలోనూ, వారి స్వగ్రామం హన్మాజీ పేటలోనూ ప్రభుత్వ పరంగానే సినారె కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంద‌"న్నారు కేసీఆర్‌.