డిఫ‌రెంట్ ఫిల్మ్‌.. అన‌గ‌న‌గా ఓ ప్రేమ‌క‌థ‌

KLN Raju says Anaganaga O Prema Katha is a different film
Tuesday, November 20, 2018 - 22:45

ఆయనకు తెలుగు చలనచిత్ర రంగం తో విశేషమైన అనుబంధం ఉంది... పరిశ్రమలోని ప్రముఖులు అందరికీ ఆయన సుపరిచితులు. గతంలో రాంగోపాల్ వర్మ డైరెక్షన్ లో “అనగనగా ఒక రోజు”, పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో “అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి” వంటి చిత్రాలు నిర్మించినప్పటికీ ఆయన ఫిలిం ప్రొడ్యూసర్ గా కంటే ఫిలిం ఫైనాన్షియర్ గానే ఇండస్ట్రీలో పాపులర్ అయ్యారు. కొన్ని వందల సినిమాలకు ఫైనాన్స్ చేసి చిన్న సినిమాలకు అండదండగా, ఆపద్బాంధవుడిగా నిలిచిన ప్రముఖ ఫైనాన్సియర్ కె. ఎల్. ఎన్. రాజు చాలా కాలం తరువాత  చిత్ర నిర్మాణాన్ని చేపట్టటం పరిశ్రమలో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. 

కోట్ల రూపాయల బడ్జెట్ తో, భారీ తారాగణంతో అత్యంత భారీ చిత్రాలు నిర్మించగల దమ్ము- సొమ్ము ఉన్నప్పటికీ ఒక చిన్న లవ్ స్టోరీతో నిర్మాతగా  తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు కే. ఎల్. ఎన్. రాజు.  ప్రస్తుతం ఆయన నిర్మిస్తున్న “అనగనగా ఒక ప్రేమ కథ” షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. డిసెంబర్ రెండో వారంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్న కె.ఎల్.ఎన్. రాజు తన అనుభవాలను, చిత్ర నిర్మాణ విశేషాలను  మీడియాతో  షేర్ చేసుకున్నారు. 

చాలా కాలం తర్వాత చిత్ర నిర్మాణంలోకి  వచ్చారు. ఇంత గ్యాప్ రావడానికి కారణం ఏంటి?

బేసికల్ గా నేను ఫిలిం ఫైనాన్సర్‌ని. గత నలభై సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమలో ఉంటున్నప్పటికీ నిర్మాణం వైపు వెళ్లాలనే ఆసక్తి ఉన్నప్పటికీ  ఇతర బిజినెస్ లు, వ్యాపకాల వల్ల ప్రొడక్షన్ మీద ఎక్కువ దృష్టి పెట్టలేకపోయాను. గతంలో రాంగోపాల్ వర్మ యాక్షన్ సినిమాలు తీస్తున్న టైమ్‌లో  ఆయన దర్శకత్వంలో "అనగనగా ఒక రోజు" అనే  లవ్ స్టోరీ తీశాను. అలాగే పూరి జగన్నాథ్ కూడా యాక్షన్ సినిమాలు తీస్తున్న సమయంలో ఆయన రెండు మూడు కథలు చెప్పినప్పటికీ" అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి" కథ నచ్చి ఆ సినిమా తీశాను. అంటే బేసికల్ గా  నాకు క్యూట్ లవ్ స్టోరీలు అంటే ఇష్టం. ఆ రెండు సినిమాల తరువాత ఇన్నాళ్లకు మరలా  ఈ సినిమా తీయాలి అనిపించింది. దానికి  ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ వెంకటేష్ తెచ్చిన ప్రపోజలే కారణం. ఈ సినిమా దర్శకుడు ప్రతాప్ ను నాకు పరిచయం చేసి సబ్జెక్ట్ వినిపించాడు. నాకు బాగా నచ్చింది. దీనికి ఒక యంగ్ హీరో కావాలి... విరాజ్ అశ్విన్‌ని కూడా తనే తీసుకువచ్చాడు. దర్శకుడు చెప్పిన కథ, హీరో నచ్చటం వల్ల  ఈ సినిమా ప్రారంభించాను.

ఇన్ని సంవత్సరాల తరువాత సినిమా తీయాలి అనేంతగా మిమ్మల్ని టెంప్ట్  చేసిన  ప్రత్యేకత ఈ కథలో ఏముంది?

ఇది ఒక టిపికల్ లవ్ స్టోరీ. టెక్నాలజీ అన్నది రోజురోజుకు పెరుగుతుంది. సృష్టికి ప్రతి సృష్టి చేసే స్థాయికి మనిషి వెళ్లాడు.  కానీ టెక్నాలజీ ఎంత పెరిగినా అది మన ఫైవ్ సెన్సెస్ కు లోబడే ఉండాలి. అలా కానప్పుడు జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పే కథాంశమిది. లవ్, టెక్నాలజీ, యాక్షన్, ఫ్యామిలీ సెంటిమెంట్ వంటి అన్ని ఎలిమెంట్స్ ఉన్న కంప్లీట్ స్టోరీ ఇది. అందుకే నాకు నచ్చింది... అందుకే చాలా కాలం తర్వాత సినిమా తీస్తున్నాను. ఈ సినిమా టైటిల్ కింద 
"touch has a memory"- అనే టాగ్ లైన్ ఉంటుంది. ఈ కథకు ఆ టాగ్ లైన్ కు మధ్య మంచి కనెక్టివిటీ ఉంటుంది.

*గతంలో "అనగనగా ఒక రోజు" తీశారు.. ఇప్పుడు "అనగనగా ఒక ప్రేమ కథ" అంటున్నారు. మధ్యలో "అమ్మానాన్న తమిళమ్మాయి"- కూడా 'అ' తో ప్రారంభమవుతుంది. ఈ 'అ' సెంటిమెంట్ ఏమిటి?

- ఇందులో సెంటిమెంట్ ఏమీ లేదండి. అనగనగా- అనేది అర్జునుడికి మరో పేరు. శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించేటప్పుడు తన పేరు అయిన " అనగా అనగా" అనే  సంబోధనతో ప్రారంభిస్తాడు. అదే మనకు కాలక్రమేనా ఒక కథను చెప్పేటప్పుడు 'అనగనగా'.. అని  ప్రారంభించడం ఆనవాయితీ అయింది. ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూ లో అనగనగా అనేది కథా ప్రారంభాన్ని సూచిస్తుంది.

దర్శకుడు ప్రతాప్ గురించి చెప్పండి?
కథ చెప్పినప్పుడు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో సినిమా  తీసేటప్పుడు కూడా అంతే కాన్ఫిడెంట్ గా, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉన్నాడు.... సినిమా బాగా తీశాడు.

 కొత్త హీరో విరాజ్ అశ్విన్ ఎలా ఉన్నాడు? ఎలా చేశాడు? అతను యాక్టింగ్  లో ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నాడా?
మా హీరో మాకు బాగానే ఉంటాడు. ఎలా ఉన్నాడు అన్నది జనం చెప్పాలి. నా వరకు నేను చెప్పాలంటే చాలా హ్యాండ్ సమ్ గా, చలాకీగా ఉన్నాడు. వైజాగ్ లో ప్రముఖ యాక్టింగ్ కోచ్ అయిన సత్యానంద్ గారి దగ్గర ట్రైనింగ్ అయ్యాడు. అందుకే అంత ఈజీగా చేయగలిగాడు.

మీ సినిమా పబ్లిసిటీ కూడా వెరైటీగా చేస్తున్నారు. ఒక్కొక్క పాటను ఒకొక్క  ప్రముఖుడితో రిలీజ్ చేయించడానికి కారణం ఏమిటి?
సినిమా తీయడమే కాదు... దానిని పబ్లిక్ దృష్టికి తీసుకు వెళ్ళటం కూడా చాలా ముఖ్యం. గతంలో లాగా పేపర్ పబ్లిసిటీ ఒక్కటే గత్యంతరం  అన్న పరిస్థితి ఇప్పుడు లేదు. టీవీలు, వెబ్సైట్స్, సోషల్ మీడియా వంటి ఆల్టర్నేటివ్ మీడియా చాలా వచ్చింది కాబట్టి అన్నింటిని ఉపయోగించుకునేందుకే అలా చేశాం.

మా "అనగనగా ఒక ప్రేమ కథ" టీజర్ ను రానా విడుదల చేశారు. ఫస్ట్ సాంగ్ శేఖర్ కమ్ముల, సెకండ్ సాంగ్  పూరీ జగన్నాథ్, థర్డ్ సాంగ్  పరుశురాం,  ఫోర్త్  సాంగ్ మణిరత్నం గారు రిలీజ్ చేశారు. ఇలా నలుగురు ప్రముఖ దర్శకులు సాంగ్స్ రిలీజ్ చేయటం వల్ల ఆడియోకు మంచి పబ్లిసిటీ వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ కె.సి. అంజన్ చాలా మంచి మెలోడియస్  ట్యూన్స్ ఇచ్చాడు. ఆడియో బాగా క్లిక్కయింది. టీవీలో వస్తున్న టాప్ టెన్ సాంగ్స్ లో " మా "అనగనగా ఒక ప్రేమ కథ" సాంగ్స్ ఉండటం మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అలాగే ట్రైలర్ ను హీరో గోపీచంద్ ఆవిష్కరించారు. ట్రైలర్ రెస్పాన్స్ కూడా చాలా బాగా ఉంది

పెద్ద క్యాస్టింగ్ తో  ఎంత భారీ చిత్రమైనా  తీయగల కెపాసిటీ ఉన్న మీరు చిన్న సినిమా తీయడానికి కారణం ఏమిటి?

పెద్ద సినిమాలు, మల్టీ స్టారర్స్ తీయటం కంటే చిన్న సినిమాలు తీయడంలోనే నిజమైన చాలెంజ్, శాటిస్ఫ్యాక్షన్ ఉంటాయి. పెద్ద సినిమా అనేది ఎవరి చేతుల్లో ఉండదు. మన చేతుల్లో ఉండి మన అభిరుచి మేరకు తీసుకున్నాం అనే తృప్తి చిన్న సినిమా తీసినప్పుడే కలుగుతుంది.

“అనగనగా ఒక ప్రేమ కథ” రిలీజ్ ప్లానింగ్ గురించి చెప్పండి?
ఈ సినిమాను గీతా ఆర్ట్స్ ద్వారా రిలీజ్ చేయబోతున్నాం. డిసెంబర్ 14న సినిమాను రిలీజ్ చేస్తున్నాం.