'మా'కు ఆ శక్తి లేదు!

MAA has become a puppet orgainsation
Tuesday, September 18, 2018 - 10:30

శివాజీరాజా, నరేష్ ల మధ్య మొదలైన సవాళ్ళు, ప్రతి సవాళ్ళు మొత్తానికి ముగిశాయి. అంటే ఏదో ఆ సవాళ్ళకి సమాధానాలు దొరకడం వల్ల సామరస్యంగా ముగిసింది అనుకొంటే భ్రమే. సినీ పెద్దలు రంగ ప్రవేశం చేసి ఇంతకంటే పరువుపోగొట్టుకోలేం అని ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. ఆ షాపోడు, ఈ షాపోడు గొడవపడితే ఉప్పు రేటు బయటపడింది అన్నట్లు – అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల మధ్య గొడవ మూలంగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) డొల్లతనం బయటపడింది.

‘మా’ను ఆర్థికంగా బలోపేతం చేయడం, భవనం నిర్మించుకోవడం లాంటి కార్యక్రమాలకి విదేశాల్లో అగ్ర తారల చేత ప్రదర్శనలు ఇప్పించి నిధులు సమీకరించుకోవడం దగ్గర అసలు తగాదా రాజుకుంది. ఇందులో ఆధిపత్యపోరు సంగతి పక్కనపెడితే - అగ్ర నటులు విదేశాల్లో తైతక్కలు ఆడితే తప్ప నిధులు సమకూర్చుకోలేని స్థితిలో తెలుగు సినిమా నటుల సంఘం ఉందా? 

ఒక సినిమాకి రూ.20 కోట్లు పైనే పారితోషికం అందుకొనే స్టార్ హీరోలు ఉన్నారు. ఇలాంటి స్థాయి వాళ్ళు ఓ అరడజను ఉంటారు అనుకొందాం. ఇక రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల మధ్య వసూలు చేసే యువ హీరోలు ఉండనే ఉన్నారు కదా. ఇక హీరోయిన్లు కూడా భారీగానే తీసుకుంటున్నారు కదా. హాస్యనటులు, అమ్మ పాత్రలు వేసేవాళ్ళు రోజుకింత అని తీసుకుంటున్నారు. వీళ్ళ నుంచి వినాయక చవితి చందా మాదిరి ఫిక్సెడ్ గా ఎందుకు ఇంత అని వసూలు చేసే దమ్ము ‘మా’ నాయకులకి లేదా? ప్రతి సినిమాకీ కొంత శాతం  ‘మా’కు వెళ్ళేలా చేసుకోలేరా? 

ఇది ఎలా ఉంది అంటే... తెలుగు చిత్ర సీమలో నటులు ధనవంతులే… వాళ్ళ సంఘమే పేదరికంలో ఉంది. ‘మా’వాళ్ళకి బీద అరుపులు కొత్త కాదు. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ – మా వాళ్ళు వెళ్ళి మేము భవనం కట్టుకుంటాం స్థలం ఇవ్వమని అడిగితే – మీకు మురళీ మోహన్ ఉన్నాడు కదా అని ఎక్కసెక్కం ఆడి స్థలం ఇవ్వబోమని అన్యాపదేశంగా చెప్పారు. అయినా పౌరుషానికిపోలేదు. అప్పటికీ ఇప్పటికీ మా నాయకులకి భవన నిర్మాణం ఓ నినాదమే.

నటుల సంఘం నిధుల కోసం తారలతో కార్యక్రమాలు చేసుకోవడం దక్షిణాదిన పరిపాటే. అయితే ఇలా రోడ్డునపడ్డ దాఖలాలు అంతగా కనిపించవు. మలయాళంలో ‘అమ్మ’ నిధుల కోసం నటులంతా కలిసి ‘ట్వంటీ ట్వంటీ’ అనే సినిమాలో నటించారు. దాని ద్వారా వచ్చిన మొత్తాన్ని తమ సంఘం ‘అమ్మ’కు ఇచ్చారు. తమిళంలో నడిగర్ సంఘం కోసం విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చి క్రికెట్ ఆడి నిధులు సమీకరించారు. అంతే కాదు విశాల్, కార్తీ కలిసి ఓ సినిమాలో నటించి దాని ద్వారా వచ్చే మొత్తాన్ని నడిగర్ సంఘానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. భవనం కూడా కట్టించుకుంటున్నారు. ఆ విధమైన ప్లాన్స్ ఏమీ ‘మా’కు ఉన్నట్టు కనిపించవు. అంతా ఆధిపత్య పోరు తప్ప. నటులందరినీ ఒక తాటిపైకి తెచ్చి నిధులు సమకూరుచుకొనే శక్తి ఉన్నట్లు కనిపించదు. 

పైగా ఈ సంఘంలో గ్రూపుల కుమ్ములాటలు ఉండనే ఉన్నాయి. నటుల పరువు వివిధ మాధ్యమాల ద్వారా వివిధ సందర్భాల్లో పోతున్నా స్పందించే తీరు సక్రమంగా ఉండదు. శ్రీ రెడ్డి ఇష్యూలో చిత్ర సీమ పరువు రోడ్డు మీదకు వచ్చినా ఛానెళ్లను అదుపు చేసుకోలేకపోయారు. పవన్ కల్యాణ్ వచ్చి మా పాలక మండలిని నిలదీశారు. అప్పటికి హడావిడి చేశారు తప్ప నిర్దిష్టంగా ఏ పనీ చేయలేదు. అమెరికా ప్రదర్శనలపై నరేష్ లేవనెత్తిన ప్రశ్నలకి జవాబులు లేకుండానే సర్దుకున్నారు. 

ఇక మహేష్‌బాబుపై తమిళ కమెడియన్ (ఏదో టీవి కార్యక్రమంలో కనిపించినవాడు. సినిమా నటుడు కూడా కాదు) కామెంట్ చేశాడని ‘మా’ హడావిడిగా నడిగర్ సంఘానికి లేఖ రాసింది. అంటే ఒక్కో కుటుంబానికి ఒక్కో విధంగా స్పందిస్తుందా ‘మా’. 

ఇక్కడ కుటుంబాల ప్రస్తావన ఉండదు... నటులంతా ఒకటే అనే సత్తా ‘మా’ పాలక మండలికి లేదు. ఇప్పుడు నరేష్ హవా మొదలైంది కాబట్టి మహేష్‌ మీద ఈగ వాలినా గొడ్డలితో నరికేందుకు ‘మా’ రెడీ అవుతుంది. రేపోఎప్పుడో మెగా క్యాంప్ వాళ్ళు పదవిలో ఉంటే కొణిదెల, అల్లు కుటుంబాల మీద ఈగ వాలనీయరు. సత్తా లేని నాయకులు, ప్రభుత్వానికి భజన చేసి స్వలాభం చూసుకొనేవాళ్ళు ‘మా’ పీఠం మీద కూర్చున్నంత కాలం నటుల సంఘం విదేశీ ప్రదర్శనల ద్వారా నిధులు సమకూర్చుకోవాల్సిందే.