మీ టూ..స‌రైన ఉద్య‌మమే: ఐశ్వ‌ర్య

MeToo movement gaining momentum as a positive sign: Aishwarya
Tuesday, October 9, 2018 - 23:15

దేశంలోని అన్ని సినిమా రంగాల‌ను, మీడియా ప్ర‌పంచాన్ని కుదిపేస్తోంది మీ టూ ఉద్య‌మం. లైంగిక వేధింపుల‌కి గురైన మ‌హిళ‌లు మీ టూ (నేను కూడా బాధితురాలినే అనే అర్థంలో) అంటూ త‌మ‌ని వేధించిన సెల‌బ్రిటీల పేర్ల‌ని బ‌య‌ట పెడుతున్నారు. త‌నుశ్రీ ద‌త్తా ..నానా ప‌టేక‌ర్ పేరు వెల్ల‌డించంతో మొద‌లైన ఈ ఉద్య‌మం ఇపుడు మ‌రింత ఊపందుకొంది. ఫేమ‌స్ సింగ‌ర్ కైలాస్ ఖేర్ త‌న‌ని వేధించాడ‌ని ఒక జ‌ర్న‌లిస్ట్ బ‌య‌ట‌పెట్టింది. త‌మిళ సాహితీ దిగ్గ‌జం వైర‌ముత్తు త‌న రూమ్‌కి ర‌మ్మ‌న్నాడ‌ని ప్ర‌ముఖ గాయ‌ని చిన్మ‌యి ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించింది. న‌టుడు ర‌జ‌త్ క‌పూర్‌, ద‌ర్శ‌కుడు వికాస్ బెహ‌ల్‌, వివేక్ అగ్నిహోత్రి, మైనే ప్యార్ కియాలో తండ్రి పాత్ర పోషించిన అలోక్ నాథ్‌.. ఇలా ప‌లువురు పేర్లు బ‌య‌టికి వ‌చ్చాయి. కొంద‌రు త‌మ త‌ప్పుని అంగీక‌రించారు. కొంద‌రు ఖండించారు. ఐతే  ఈ వివాదం, ఉద్య‌మం మాత్రం సోష‌ల్ మీడియాని షేక్ చేసింది. 

దాంతో ప‌లువ‌రు హీరోలు, హీరోయిన్లు సినిమా ప‌రిశ్రమ‌లో లైంగిక వేధింపుల గురించి స్పందించ‌క‌త‌ప్ప‌డం లేదు. ప్ర‌ముఖ న‌టి ఐశ్వ‌ర్యారాయ్ కూడా తాజాగా రెస్పాండ్ అయింది. స‌రైన టైమ్‌లో ఈ ఉద్య‌మం ఊపందుకుంటోంది.

"ఇది మంచి పరిణామ‌మే. ఐతే వ్య‌క్తుల గురించి నేను స్పందించ‌ను. ఎందుకంటే కొన్ని కేసుల్లో ఇపుడు లీగ‌ల్ చ‌ర్య‌లు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ కేసులు ఎలా ట‌ర్న్ అవుతాయో చూద్దాం. మ‌హిళ‌ల‌కి ఎపుడూ బాస‌ట‌గా ఉంటాను. ఉద్య‌మానికి మ‌ద్ద‌తు ఇస్తా", అని ఐశ్వ‌ర్యా చెప్పింది.

44 ఏళ్ల ఐశ్వ‌ర్య ఇప్ప‌టికీ చెర‌గ‌ని సౌంద‌ర్య సుగంధాల‌తో అద‌ర‌గొడుతోంది.