బ‌యోపిక్కా? భ‌యోపిక్కా?

Nandamuri fans request Balakrishna not to do RGV's film
Tuesday, July 4, 2017 - 22:00

సీనియర్ ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తీస్తానని రామ్ గోపాల్ వర్మ ప్రకటించినప్పటి నుంచి నందమూరి అభిమానుల గుండెలు కొట్టుకుంటున్నాయి. దీనికి తోడు ఈ బయోపిక్ లో స్వయంగా తమ నటసింహం బాలయ్య బాబు నటిస్తాడంటూ వార్తలు రావడంతో అభిమానుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. వీళ్ల భయానికి ఒకే ఒక్క కారణం వర్మ.

వర్మ సూపర్ హిట్ డైరక్టరేం కాదు. ప్రస్తుతం టాప్ హీరోలెవరూ వర్మతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అంతెందుకు వర్మను గుడ్డిగా ఫాలో అయ్యే అమితాబ్ కూడా భవిష్యత్తులో మళ్లీ అతడితో కలిసి సినిమా చేయకపోవచ్చు. ఆ రేంజ్ లో డిజాస్టర్ అయింది "సర్కార్ 3" సినిమా. సో.. ఇలాంటి టైమ్ లో వర్మతో బాలయ్య సినిమా అనేసరికి బెంబేలెత్తిపోతున్నారు ఫ్యాన్స్.

ఎన్టీఆర్ జీవిత చరిత్రలో బాలయ్య నటిస్తే ఫ్యాన్స్ కు ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే ఆ సినిమాను వర్మ డైరక్ట్ చేయొద్దనేది ఫ్యాన్స్ డిమాండ్. ఈ మేరకు త్వరలోనే బాలకృష్ణను కలిసి నచ్చజెప్పాలని అభిమాన వర్గం భావిస్తోంది. బాలయ్య ఎవరిమాట వినడంటారు. అది నిజమే. కాకపోతే అప్పుడప్పుడు వింటాడు. మొన్నటికి మొన్న "పైసా వసూల్" సినిమాకు ఆ పేరు పెట్టడానికి ముందు "తేడా సింగ్' అనే టైటిల్ తెరపైకి వస్తే, ఫ్యాన్స్ అభ్యంతరం చెప్పారు. కాబట్టి ఈసారి కూడా బాలకృష్ణ తమ మాట వింటాడని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. వర్మతో సినిమా చేస్తే అది బయోపిక్ అవ్వదని, భయోపిక్ గా మారుతుందని.. ఆ ఆలోచన నుంచి విరమించుకోవాలని బాలయ్యకు కాస్త గట్టిగానే నచ్చజెప్పాలనుకుంటున్నారు కొందరు అభిమానులు.