బాలయ్యదే తుది నిర్ణయం
నందమూరి బాలకృష్ణ మొన్నటి వరకు క్రిష్ ఏది చెపితే అది చేశాడు. తన వందో చిత్రాన్ని సూపర్‌గా సక్సెస్ చేయడంతో బాలయ్యకి క్రిష్ మీద అంత గురి కలిగింది. అందుకే ఎన్టీఆర్ బయోపిక్ బాధ్యతలు అప్పగించాడు బాలయ్య. మొదటి భాగం "ఎన్టీఆర్ కథానాయకుడు" జనవరి 9న విడుదలయింది. జనవరి 9 వరకు బాలయ్య క్రిష్ ఏది చెప్పినా నో చెప్పలేదు. జనవరి 10 నుంచి సీన్ మారింది.
"ఎన్టీఆర్ కథనాయకుడు" సినిమాకి క్రిష్ వల్లే అంత క్రేజ్ వచ్చిందనేది ఎంత వాస్తవమో.. ఆ సినిమాని రెండు భాగాలుగా తీయాలన్న నిర్ణయం వల్లే సినిమా అంతటి పరాజయం పాలు అన్నది అంతే వాస్తవం. అందుకే, బాలయ్య సినిమా రిలీజ్ అయిన తర్వాత క్రిష్ చెప్పిందల్లా వినడం తగ్గించాడు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే సీన్ మొత్తం రివర్స్ అయింది. అందుకే ఇప్పటి వరకు సినిమా విడుదల తేదీని అఫీషియల్‌గా ప్రకటించలేదు. రెండో భాగం సినిమా షూటింగ్ కూడా మొన్నే (ఫిబ్రవరి 9) పూర్తయింది.
క్రిష్ ఇదివరలా అన్ని తన చేతిలో ఉంచుకొని ఉంటే.. గుమ్మడికాయ కొట్టిన గంటకే... ట్విట్టర్‌లో రెండు పోస్టర్స్ వదిలేవాడు. కానీ ఇపుడు అన్ని నిర్ణయాలు బాలయ్యే తీసుకుంటున్నారు. ఈ రోజు కానీ, రేపు కానీ బాలయ్య రిలీజ్ డేట్ విషయంలో ఒక నిర్ణయానికి రావొచ్చు. ఫిబ్రవరి 22నే విడుదల చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఆ డేట్ మార్చి.. ఫిబ్రవరి 28కి వేస్తే... కల్యాణ్‌రామ్‌కి ఇబ్బంది. కల్యాణ్‌రామ్ ఇప్పటికే తన సినిమా 118ని మార్చి 1న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు.
- Log in to post comments