వాళ్ల‌ని టెన్స‌న్‌ పెడుతోన్న‌ ప‌వ‌ర్‌స్టార్‌

Pawan Kalyan dodges on poll alliances
Tuesday, September 18, 2018 - 23:45

తెలంగాణ ఎన్నిక‌లకి నోటిఫికేష‌న్ వ‌చ్చే నెల మొద‌టి వారంలోనే వ‌స్తుంద‌నేది అంచ‌నా. అందుకే ముందే పొత్తులు కుదుర్చుకునేందుకు అన్ని పార్టీలు త‌హ‌త‌హ‌లాడుతున్నాయి. పాల‌క పార్టీ టీఆర్ఎస్‌ని ఢీకొట్టాలంటే కూట‌మిగా కూడా క‌ష్ట‌మే కానీ క‌నీసం పొత్తులు లేక‌పోతే ముందు చేతులెత్తెసిన‌ట్లు అవుతుంది. అందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకే వ్య‌తిర‌కం అని చెప్పిన సీపీఎం పార్టీ ప‌వ‌ర్‌స్టార్ తో పొత్త కొసం తెగ ట్రై చేస్తోంది.

తెలంగాణ విష‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ది మొద‌టి నుంచి వెరైటీ పంథా. 2014 ఎన్నిక‌ల టైమ్‌లోనూ, ఆ త‌ర్వాత ఓ రెండేళ్ల పాటు తెలంగాణ రాష్ట్ర స‌మితితో వ్య‌తిరేక వైఖ‌రి ప్ర‌ద‌ర్శించాడు. రీసెంట్‌గా మొత్తంగా వైఖ‌రి మార్చ‌కున్నాడు. టీఆర్ ఎస్‌తో ఇపుడు ఘ‌ర్ష‌ణ వైఖ‌రి లేదు. కేసీఆర్ ప్ర‌భుత్వ ప‌నితీరుపై ఆ మ‌ధ్య చాలా పాజిటివ్‌గా కూడా మాట్లాడాడు. 

నాలుగేళ్ల పాల‌న త‌ర్వాత ఉండే స‌హ‌జ‌సిద్ద కొంత వ్య‌తిరేక‌త మిన‌హా కేసీఆర్‌పై పెద్ద‌గా యాంటి ఇన్‌క్యుంబెన్సీ వేవ్ లేదు. అందుకే కేసీఆర్‌కి వ్య‌తిరేకంగా పోరాడాల‌నే విష‌యంలో డైలామాలో ఉన్నాడు జ‌న‌సేనాని. పోటీ విష‌యంలో ఇంకా తేల్చుకోవ‌డం లేనిది అందుకే. ఒక వేళ పోటీ చేసినా త‌మ పార్టీ ప్ర‌భావం చూపుతుందా అనే విష‌యంలో ప‌వ‌న్‌కి క్లారిటీ లేదు. ఇక తెలంగాణ ఏర్పాటునే వ్య‌తిరేకించిన సీపీఎంతో పొత్తు పెట్టుకుంటే మొత్తానికే బెడిసికొడుతుందా అన్న అనుమానం కూడా ప‌వ‌ర్‌స్టార్‌లో ఉంది. ఈ కార‌ణాల వ‌ల్లే ఏ నిర్ణ‌యమూ ప్ర‌క‌టించ‌లేదు ఇంత‌వ‌ర‌కు. 

ఐతే ప‌వ‌ర్‌స్టార్ వ‌స్తే త‌మ‌కి కొంత ఫేస్‌వాల్యూ ఉంటుంద‌నుకుంటున్న సీపీఎం టెన్స‌న్ ప‌డుతోందిపుడు. అవ‌స‌ర‌మైతే ప‌వ‌న్‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతానంటున్నారు ఆ పార్టీ జాతీయ నాయ‌కురాలు బృందాకార‌త్‌. ఇక తెలంగాణ సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం జ‌న‌సేన అధ్య‌క్షుడికి శ‌నివారం వ‌ర‌కు డెడ్‌లైన్ విధించారు.