ప‌రిటాల గుండు కొట్టించాడ‌నేది అబ‌ద్దం

Pawan Kalyan slams rumors about Paritala and his clean-shaven look
Friday, December 8, 2017 - 17:30

తెలుగునాట చాలా కాలంగా ఒక రూమ‌ర్ ఉంది. ఒక రియల్ ఎస్టేట్ గొడ‌వ‌లో  ఫ్యాక్ష‌న్ లీడ‌ర్ ప‌రిటాల ర‌వి అనుచ‌రులను ప‌వ‌ర్‌స్టార్ తిట్టాడ‌నీ తెలిసి ప‌రిటాల ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కి గుండు కొట్టించాడ‌ట‌. ఈ ప్ర‌చారం జ‌నంలో ఉంది. చాలా మంది ఇది నిజ‌మే అని న‌మ్మారు. ఎందుకంటే అప్ప‌ట్లో ప‌రిటాల ర‌వి అంత ప‌వ‌ర్‌ఫుల్ ఫ్యాక్ష‌న్ నాయ‌కుడు.  ఆ టైమ్‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ గుండుతో ఉన్న ఫోటోలు కూడా ప‌త్రిక‌ల్లో ద‌ర్శ‌నం ఇచ్చాయి. సితార ప‌త్రిక ఏకంగా క‌వ‌ర్ పేజీ వేసింది.

ఐతే ప‌వ‌ర్‌స్టార్ ఈ రూమ‌ర్ల‌ను కూడా ధైర్యంగా జ‌నం ముందే ప్ర‌స్తావించి వాటిపై వివ‌ర‌ణ ఇచ్చాడు. శుక్ర‌వారం (డిసెంబ‌ర్ 8) విజ‌య‌వాడ‌లో జ‌రిగిన ఒక స‌భ‌లో ప‌వ‌ర్‌స్టార్ త‌నంత‌ట తానే ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించాడు.

ఆయ‌న ఏమ‌న్నాడు ఆయ‌న మాట‌ల్లోనే...

నా గుండు నేను కొట్టించుకున్నా. ప‌రిటాల ర‌వి న‌న్ను తీసుకెళ్లి గుండు కొట్టించాడ‌ని అప్ప‌ట్లో టీడీపీ దుష్ప్ర‌చారం చేసింది. ఆ టైమ్‌లో టీడీపీ వాళ్ళు మా మీద ఎన్నో రూమ‌ర్స్ లేపారు. కానీ నిజం ఏంటంటే.. ఆ టైమ్‌లో నా సినిమాలు ఆడ‌ట్లేదు, మాన‌సిక ప్ర‌శాంత లేదు, దాంతో గుండు కొట్టించుకున్నా. మ‌రి అలాంటి టీడీపీకి నేను గ‌త ఎన్నిక‌ల్లో ఎందుకు మ‌ద్ద‌తిచ్చాను అంటే విడిపోయిన ఆంధ్రాకి ఒక అనుభ‌వం ఉన్న నాయ‌కుడు కావాలి. వైఎస్పార్ పార్టీ నేత జ‌గ‌న్‌పై ఎన్నో కేసులున్నాయి. అలాంటి నేత‌కి నేను స‌పోర్ట్ ఇస్తే మంచిది కాదు. అందుకే టీడీపీ నాపై గ‌తంలో ఎన్ని పుకార్లు లేపినా..ఆంధ్రకోసం మ‌ద్ద‌తిచ్చా.