తెలుగులో పేట్టా లేట్ రిలీజ్‌?

Petta will not have simultaneous release in Telugu?
Wednesday, December 19, 2018 - 23:00

ఓవైపు "2.O" సినిమా థియేటర్లలో నడుస్తుండగానే మరో సినిమాను సిద్ధం చేశాడు రజనీకాంత్. దానికి రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేశాడు. అవును.. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న "పేట‌" సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న థియేటర్లలోకి రాబోతోంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ సినిమా తెలుగులో రిలీజ్ అవ్వడం క‌ష్ట‌మే.

సాధారణంగా రజనీకాంత్ న‌టించిన‌ ఏ సినిమా అయినా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలవుతుంది. రజనీకాంత్ సినిమా వస్తుందంటే తెలుగు స్టార్ హీరోలు సైతం తప్పుకునే పరిస్థితి ఉండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. రజనీకాంత్ కు తెలుగులో మార్కెట్ పడిపోయింది.

"పేట‌"ను తెలుగులో కూడా సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ ఈసారి రజనీకాంత్ కు భయపడి ఎవరూ తగ్గలేదు. ఎన్టీఆర్-కథనాయకుడు, ఎఫ్-2, వినయవిధేయరామ సినిమాలు చెప్పిన తేదీలకే వస్తున్నాయి. థియేటర్ల బుకింగ్ కూడా దాదాపు క్లోజ్ అయింది. దీంతో చేసేదేం లేక "పేట‌" తెలుగు రిలీజ్ ను వాయిదావేశారనేది టాక్‌. జనవరి 25న లేక ఫిబ్రవరి మొదటి వారంలో ఈ సినిమా తెలుగు వెర్షన్ ను విడుదల చేస్తారని స‌మాచారం.