తెలంగాణ ఎన్నికల్లో నిర్మాతలు!

ఈ సారి తెలంగాణ ఎన్నికల బరిలో కొంతమంది సినిమా వాళ్లు నిలవనున్నారు. టీఆర్ ఎస్‌ని వీడి బాబూమోహన్ బీజేపీలో చేరాడు. ఈ తాజా మాజీ ఎమ్మెల్యే తదుపరి ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో చూడాలి. ఇక తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఇద్దరు ముగ్గురు సినిమా వాళ్లు ఉవ్విళూరుతున్నారు. అందులో సీటు దాదాపుగా కన్‌ఫమ్ అయిన వ్యక్తి... నిర్మాత వి.ఆనంద ప్రసాద్. ఆయన శేరిలింగంపల్లి (హైదరాబాద్) నియోజకవర్గం నుంచి పోటీ చేయడం పక్కా అని తెలుస్తోంది.
నిజాంపేట్, కూకటపల్లి ప్రాంతాల్లో తన రియల్ ఎస్టేట్ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న ఆనంద ప్రసాద్..భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై సినిమాలు నిర్మిస్తూ వస్తున్నారు. మొదట గోపిచంద్‌తోనే సినిమాలు తీశారు. రీసెంట్‌గా బాలయ్యతో పైసావసూల్, అలాగే శమంతకమణి వంటి సినిమాలు తీశారు. శేరిలింగంపల్లిలో ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారని అంచనా. అందుకే బాగా డబ్బున్న ఆనందప్రసాద్‌కి ఈ సారి చంద్రబాబునాయుడు సీటు కన్‌ఫమ్ చేసినట్లు టాక్.
మరోవైపు, మరో నిర్మాత బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజేంద్రనగర్ (హైదరాబాద్) నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారట. ఈసారి అధికార పార్టీ తెరాస తరఫున సినిమా వాళ్లు ఎవరూ పోటీకి దిగడం లేదు. తెలుగుదేశం పార్టీ నుంచే మరో ఇద్దరు సినిమా సెలబ్రిటీలు హైదరాబాద్ నుంచి రంగంలోకి దిగుతారనేది టాక్.
- Log in to post comments