నాది ఉడత సాయమే: రాజమౌళి

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి సిటీ డిజైన్లు ఒక కొలిక్కి వచ్చాయి. తెలుగు సినిమా అగ్ర దర్శకుడు రాజమౌళి సూచనలను కూడా తీసుకుంటున్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. అంతర్జాతీయంగా ఎన్నో మహా కట్టడాలను కట్టిన నార్మన్ ఫాస్టర్ సంస్థ ఈ సినిమాకి ఆర్కిటెక్చరల్ డిజైనర్. అలాంటి సంస్థ డిజైన్లు అందిస్తుండగా, ఆర్కిటెక్చర్‌కి ఏ మాత్రం సంబంధం లేని సినిమా దర్శకుడు సూచనలు తీసుకోవడం ఏంటని చాలా విమర్శలు వచ్చాయి. ఐనా చంద్రబాబు నాయుడు వెనక్కి తగ్గలేదు.
రాజమౌళి ఇంతకుముందు లండన్‌కి వెళ్లి నార్మన్ ఫాస్టర్ ఆర్కిటెక్ట్‌లకి సూచనలు ఇచ్చారు. తాజాగా రెండు రోజుల నుంచి సీఎం చంద్రబాబునాయుడుతో రాజమౌళి సమావేశం అవుతున్నారు. మీడియాతో మాట్లాడిన రాజమౌళి తన డిజైన్ ఓకే కాలేదని చెప్పారు.
"రాజధాని లో అసెంబ్లీ నిర్మాణం కోసం ఇచ్చే డిజైన్ కోసం పని చెయ్యమని సీఎం చెప్పారు. ఒక డిజైన్ ఓకే అయ్యింది. అందరికీ నచ్చింది. ఐతే దానికి కొన్ని మార్పులు చెయ్యమని సీఎం నన్ను అడిగారు. తెలుగుదనం ఉట్టి పడేలా కొన్ని ఇమేజేస్ నేను ఇచ్చాను. కానీ నేను వర్క్ చేసిన డిజైన్ ఓకే కాలేదు. నేను సూచించిన మార్పులను మీడియా సిటీ కి వాడుకుంటామని చెప్పారు సీఎం," అని రాజమౌళి మీడియాకి తెలిపారు.
రాజధాని డిజైన్లలో సినిమా దర్శకుడు ఏంటన్న విమర్శలకి కూడా జక్కన్న సమాధానం ఇచ్చారు. "రామసేతు నిర్మాణంలో ఉడత పోషించిన పాత్ర నేను రాజధాని నిర్మాణం లో పోషిస్తున్నా. అంతకుమించి నా పాత్ర ఏమీ లేదు. నాది ఉడత సాయమే తప్ప మొత్తం డిజైన్లకి నాకు పెద్దగా సంబంధం లేద,"న్నారు.
- Log in to post comments