చిరు, ప‌వ‌న్ బాట‌లోనే ర‌జ‌నీకాంత్‌

Rajinikanth has not learned from Chiru and PK
Tuesday, April 23, 2019 - 10:45

డిసెంబ‌ర్ 31న ర‌జనీకాంత్ తాను రాజ‌కీయ పార్టీ పెట్ట‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇంకేముంది.. త‌మిళ‌నాట రాజ‌కీయాలు మార‌బోతున్నాయి. ర‌జనీకాంత్ సీఎం కాబోతున్నార‌ని అంతా అనుకున్నారు. కానీ క్యాలెండ‌ర్ తిర‌గ్గానే "కాలా" సినిమా పూర్తి చేశారు. "టూ పాయింట్ ఓ" రిలీజ్ చేశారు. అలా 2018లో బిజీగా ఉన్నారు ర‌జ‌నీకాంత్‌. ఇక 2019లో "పేట్టా" సినిమాని రిలీజ్ చేసి.. ఇపుడు "ద‌ర్బార్" అనే సినిమాని మొద‌లుపెట్టారు. కానీ త‌న పార్టీ ఊసు లేదు, నిర్మాణం లేదు. 

పార్టీ పెట్టిన త‌ర్వాత నాలుగేళ్లు ఖాళీగా ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌....జ‌న‌సేన‌ని సంస్థాగ‌తంగా డెవ‌ల‌ప్ చేసేందుకు చివ‌రి ఏడాదిలో హ‌డావుడి ప‌డ్డారు. ర‌జ‌నీకాంత్ వాల‌కం కూడా అలాగే ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీని డెవ‌ల‌ప్ చేయ‌డం లేదు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కి కూడా దూరంగా ఉన్నారు. కానీ త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మాత్రం పోటీ చేస్తార‌ట‌. ఈ ఏడాది అంతా ద‌ర్బార్‌తో పాటు మ‌రో సినిమాని కూడా పూర్తి చేసి.. వ‌చ్చే ఏడాది రాజ‌కీయాల‌పై ఫోక‌స్ పెడుతార‌ట‌. 

అంటే త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల‌కి ఏడాది ముందు త‌న పార్టీని డెవ‌ల‌ప్ చేస్తార‌ట‌. అలా దెబ్బ‌తిన్న చిరంజీవి రాజ‌కీయ కెరియ‌ర్‌ని చూసి కూడా ర‌జ‌నీకాంత్ అదే ప‌ద్ద‌తిని ఫాలో అవ‌డం విచిత్ర‌మే.