రష్మిక నిజంగా అంత రిచ్చా?

Is Rashmika such rich heroine to get IT raids?
Thursday, January 16, 2020 - 16:45

ఐటీ రైడ్స్ ను మరో కోణంలో చూడడం అనేది ఈ దేశంలో చాన్నాళ్ల కిందటే మొదలైంది.  నిజంగా ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అనుమానం వచ్చి, ముందే కోవర్ట్ ఆపరేషన్ చేసి, ఆ తర్వాత మూకుమ్మడిగా నివాసాలు-ఆఫీసులపై దాడులు చేయడం అనేది ఇప్పుడు దాదాపు లేదనే చెప్పాలి. ఐటీ దాడులనేది ఇప్పుడు రాజకీయమైపోయింది. కక్షపూరితంగా ఒకరిపై ఒకరు దాడులు చేయించుకోవడం కామన్ అయిపోయింది. ఇప్పుడీ లిస్ట్ లోకి రష్మిక ఎందుకొచ్చిందనేదే ఇప్పుడు అందరికీ ఆశ్చర్యకరమైన అంశంగా మారింది.

దేశంలో కొంతమందిపై ఎందుకు ఐటీ దాడులు జరగవు అనే ప్రశ్న సామాన్యుడ్ని నిత్యం వేధిస్తూనే ఉంటుంది. అది నిజమే, బాగా ధనవంతులైన కొంతమంది వ్యక్తులపై ఐటీ దాడులు జరగవు. అదంతే. వాళ్లకు వందల కోట్ల ఆస్తి ఉందనే విషయం అందరికీ తెలుసు కానీ ఫార్మాలిటీకి కూడా వాళ్ల ఆఫీసులు, ఇళ్లల్లో సోదాలు జరగవు. రష్మిక లాంటి హీరోయిన్ పై మాత్రం అమాంతం సోదాలు నిర్వహిస్తారు.

నిజానికి రష్మిక స్టార్ హీరోయిన్ కాదు. గీతగోవిందం బ్లాక్ బస్టర్ అయినా, ఛలో సూపర్ హిట్ అయినా ఆమెకు ముట్టిన పారితోషికం చాలా తక్కువ. ఆమె అంతోఇంతో కాస్త ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుందంటే అది సరిలేరు నీకెవ్వరు సినిమాకు మాత్రమే. అంతమాత్రానికే ఆమె ఇంటిపై సోదాలు నిర్వహించడం ఎంత వరకు కరెక్ట్.

అయితే ఈమధ్య సినీప్రముఖులు, సెలబ్రిటీల విషయంలో ఇన్ కమ్ టాక్స్ అధికారులు కాస్త కఠినంగానే ఉంటున్నారు. అందుకే ఎన్నడూలేని విధంగా సుమ, అనసూయ లాంటి యాంకర్ల ఇళ్లపై కూడా దాడులు నిర్వహించారు. చిన్న హీరోయిన్ అయినప్పటికీ లావణ్య త్రిపాఠీని కూడా వదల్లేదు అధికారులు. ఈ క్రమంలోనే రష్మిక ఇంటికి ఐటీ అధికారులొచ్చారు.