2.0: మంచి పాయింటే తీసుకున్న శంకర్

దర్శకుడు శంకర్ తీస్తున్న టూ పాయింట్ ఓ (2.0) సినిమా విడుదలకి సిద్దమవుతోంది. తొలి టీజర్ వినాయక చవితి సందర్భంగా విడుదలైంది. టీజర్‌కి మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది. తమిళ వెర్సన్‌కి ఎక్కువగా లైక్‌లు పడుతున్నాయి. తెలుగు ప్రేక్షకులు గ్రాఫిక్స్ తప్ప వేరే మేజిక్ లేదని అంటున్నారు. ఐతే ఓవరాల్‌గా టీజర్‌ని చూస్తే శంకర్ భలే పాయింట్ పట్టుకున్నాడని చెప్పక తప్పదు.
ఈ భూమి కేవలం మనషులకే కాదు పశుపక్ష్యాదులకీ ఆవాసం. కానీ అభివృద్ది పేరుతో మనిషి పర్యావరణాన్ని పాడు చేస్తున్నాడు. ఒకపుడు బెంగుళూర్, హైదరాబాద్ నగరాలు చలి ప్రదేశాలు. ఇపుడు చలికాలం కూడా అంత చలిని ఫీలయ్యే సీన్ లేదు కాంక్రీట్ జంగిల్ కారణంగా. ఇది పర్యావరణ సమస్య. భూమినే కాదు, గాలిని కూడా కలుషితం చేశారు మనుషులు. రేడియో తరంగాల పొల్యూషన్‌తో పక్షులు కూడా బతకలేకపోతున్నాయని పర్యావరణవేత్తలు చాలా కాలంగా మొత్తుకుంటున్నారు ఐనా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇష్టారాజ్యంగా సెల్‌టవర్స్‌ని పెట్టొద్దని చెపుతున్నా వినడం లేదు. రేడియేషన్ కారణంగా తెలంగాణ, ఆంధ్రల్లో చాలా ప్రాంతాల్లో పిచ్చుకలనేవి కనుమరుగయ్యాయి. అవి ఉనికిని కోల్పోయాయి.
మనుషులతో ప్రమాదం ఉందని గ్రహించిన పక్షులే ఎదురుతిరిగితే ఎలా ఉంటుంది? ఇది మీ (మానవుల) సామాజ్ర్యం మాత్రమే కాదు మాది కూడా అని చెప్పేందుకు పక్షులు తిరగబడితే ఎమవుతుందనేది టూ పాయింట్ ఓలో కాన్సెప్ట్‌గా కనిపిస్తోంది. అక్షయ్‌కుమార్ పక్షిరాజా గెటప్‌లోని మర్మం అదే. టీజర్ మొదట్లోనే సెల్ టవర్లని చుట్టుముట్టిన కాకులను చూపించాడు శంకర్.
కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా..శంకర్ కాన్సెప్ట్‌లు గమ్మత్తుగా ఉంటాయి. ఈ సారి రోబో సీక్వెల్‌లో హాలీవుడ్ దర్శకులు (హిచ్‌కాక్ తీసిన హారర్ థ్రిల్లర్ ది బర్డ్స్‌ని పక్కన పెడితే) కూడా అంతగా టచ్ చేయని పాయింట్‌ని పట్టుకున్నాడు ఈ దర్శకధీరుడు.
- Log in to post comments