శర్వానంద్‌ ఇక జాగ్రత్త పడుతున్నాడు

Sharwanand is cautious about next movies
Saturday, August 24, 2019 - 19:15

శర్వానంద్‌కి వరుసగా రెండు భారీ దెబ్బలు తగిలాయి. ఎన్నో ఆశలుపెట్టుకొని చేసిన పడి పడి లేచే మనసు, రణరంగం సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తాకొట్టాయి. పడి పడి లేచే మనసుతో పోల్చితే రణరంగం చాలా బెటర్‌. ఓపెనింగ్స్‌ కూడా గట్టిగా వచ్చాయి. ఐతే ఆ తర్వాత నిలబడలేదు. ఈ రెండు సినిమాల అపజయంతో శర్వానంద్‌లో కొంత కంగారు మొదలైంది.

మినిమం గ్యారెంటీ హీరో అనిపించుకున్న హీరోకి ఇలా వరుస ఫ్లాప్‌లు రావడం కొంత ఇబ్బందికరమే. తన తదుపరి చిత్రాల వ్యాపారంపై ఈ రెండు సినిమాలు గట్టిగా ప్రభావం చూపుతాయి. తన మార్కెట్‌ రేంజ్ కూడా తగ్గుతుంది. ఇక ఫ్లాప్‌లకి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు మొదలుపెట్టాడు. ఇపుడు తాను ఒప్పుకున్న రెండు సినిమాల విషయంలో చాలా కేర్‌ తీసుకుంటాడట.

శర్వానంద్‌ దిల్‌రాజు నిర్మిస్తున్న 96 రీమేక్‌తో పాటు శ్రీకారం అనే ఒక మాస్‌ మూవీ చేస్తున్నాడు. శ్రీకారం కొత్త దర్శకుడు తీస్తున్నాడు. 96 రీమేక్‌లో కూడా కొన్ని సందేహాలున్నాయి. ఎందుకంటే ఈ సినిమాలో కూడా శర్వానంద్‌ యంగ్‌గానూ, మిడిల్‌ఏజ్డ్‌గానూ కనిపించాలి. ఆ రెండు లుక్‌లను రణరంగంలో ఆల్రెడీ చూపించాడు. మరి 96లో కొత్తదనం ఉంటుందా? ఆ డౌట్స్‌ వస్తున్నాయి. ఐతే... నిర్మాత దిల్‌రాజు కావడంతో భరోసా ఉంది.