సునీల్ అంత పనికిరాకుండా పోయాడా?

Sunil's sorry state
Thursday, November 15, 2018 - 17:30

కమెడియన్ గా రీఎంట్రీ ఇద్దామనుకుంటున్న హీరో సునీల్ కు సెకండ్ ఇన్నింగ్స్ పెద్దగా కలిసొస్తున్నట్టు లేదు. అల్లరి నరేష్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నా ఫలితం దక్కలేదు. మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అరవింద సమేతలో గుర్తుంచుకునే క్యారెక్టర్ ఇవ్వలేకపోయాడు. తాజాగా అమర్ అక్బర్ ఆంటోనీ కూడా సునీల్ కు ఏమాత్రం కలిసిరాలేదనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. స్వయంగా రవితేజ, శ్రీనువైట్ల తమ సినిమాలో సత్యకు మంచి పాత్ర దొరికిందని, వెన్నెల కిషోర్ పాత్ర హిలేరియస్ గా ఉంటుందని చెబుతున్నారు తప్ప, సునీల్ పాత్ర బాగా పండిందని చెప్పడం లేదు.

ట్రయిలర్ చూస్తే ఈ విషయం అర్థమౌతూనే ఉంది. సునీల్ కంటే వెన్నెల కిషోర్ కు మంచి పాత్ర, ప్రాధాన్యం దక్కింది. ట్రయిలర్ లోనే 'వెన్నెల' డామినేషన్ ఇంతలా ఉందంటే, ఆటోమేటిగ్గా సినిమాలో కూడా సునీల్ కంటే వెన్నెల కిషోర్ కే స్కోప్ ఎక్కువ ఉన్నట్టు అర్థం. దీనికి తోడు సరిగ్గా పండని సునీల్ కామెడీ సీన్లను ఎడిటింగ్ టేబుల్ పై కత్తిరించి పడేశారనే వార్త మరింత ఇబ్బంది పెడుతోంది.

హీరోగా కష్టకాలం నడుస్తుండటంతో మనసు చంపుకుని మరీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు సునీల్. అయితే సునీల్ హీరో అయిన టైమ్ లో ఆయన ప్లేస్ ని చాలామంది భర్తీ చేశారు. ముఖ్యంగా వెన్నెల కిషోర్ బాగా ఫామ్ లో ఉన్నాడు. సినిమా రిలీజై వీరిద్దరి క్యారెక్టర్స్ లో వెన్నెలదే పైచేయి అయితే మాత్రం సునీల్ కెరీర్ కు కచ్చితంగా డేంజర్ బెల్స్ మోగాయనే చెప్పుకోవాలి.