ప‌రువు హ‌త్య ఏందిరా జంగిల్ ఫెలో!

Tollywood celebrities respond on honor killings
Monday, September 17, 2018 - 23:45

కులం ప‌రువు, కుటుంబం ప‌రువు అంటూ మిర్యాల‌గూడ‌కి చెందిన మారుతిరావు త‌న సొంత కూతురి భ‌ర్త‌ని చంపించిన ఘ‌ట‌న అంద‌ర్నీ క‌లిచివేసింది. కులపిచ్చి మ‌నుషుల మ‌న‌సుల్లో విషంగా ఎలా ఎక్కిందో నిరూపించిన అమానుష ఘ‌ట‌న‌..ప్ర‌ణ‌య్ హ‌త్య‌. మిర్యాల‌గూడ‌కి చెందిన ప్ర‌ణ‌య్‌.. అమృత అనే అగ్ర‌వ‌ర్ణాలకి చెందిన యువ‌తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అమృత త‌న త‌ల్లితండ్రుల అభీష్టానికి వ్య‌తిరేకంగా పారిపోయి ప్ర‌ణ‌య్‌ని పెళ్లాడింది. ద‌ళితుడైన ప్ర‌ణ‌య్‌..త‌న కూతురు పెళ్లాడాడు అనే క‌క్ష‌తో అత‌న్ని చంపించాడు మారుతీరావు. 

ఈ దారుణ ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా క‌లక‌లం రేపింది. టాలీవుడ్ సెల‌బ్రిటీలు కూడా  తీవ్రంగా స్పందించారు. 

 ‘ఒక పక్క సెక్షన్‌ 377 కొట్టివేస్తూ అందరూ ఒక్కటే అని సుప్రీం తీర్పు చెప్పినప్పుడు ఇక ఈ కులాలు, పరువు హత్యలు ఏందిరా జంగిల్‌ ఫెలోస్‌. ముందు మనుషుల్లా ప్రవర్తించడం నేర్చుకోండి’ అని సూటిగా స్పందించాడు హీరో రామ్‌. 

మంచు మ‌నోజ్ త‌న భావాల‌ను ఒక లేఖ రూపంలో పెట్టాడు. 

 తండ్రిని చూసుకోకుండానే ఓ పసికందు తన తండ్రిని కోల్పోయింది. ఇంతకంటే దారుణమైన ఘటన వారి జీవితాల్లో ఇంకేముంటుంది? ఇవన్నీ కులం పేరుతో చేశారా? అసలు దానికి ఏమన్నా విలువుందా? ఈ ప్రపంచంలో ఉంటున్నవారందరికీ హృదయం ఒకటే, పీల్చే గాలి ఒకటే, దేహం ఒకటే. అలాంటప్పుడు కులం పేరుతో ఇతరుల ప్రాణాలు తీయడం ఎందుకు? అందరం ఒక్కటేనని ఈ ప్రపంచం ఎప్పుడు గుర్తిస్తుంది? కుల, మతాలకు మద్దతు తెలిపేవారందరూ సిగ్గుతో తలదించుకోవాలి. ప్రణయ్‌ను చంపిన వారే కాదు..కులానికి మద్దతు తెలిపేవారందరూ నిందితులే. కులాన్ని అంతం చేయండి. ఇదో జబ్బులాంటింది. మనుషుల్లా ప్రవర్తించండి. మిమ్మల్ని మనసారా వేడుకుంటున్నాను. మన పిల్లలకు మెరుగైన ప్రపంచాన్ని కల్పిద్దాం. ప్రణయ్‌ భార్య, అతని కుటుంబీకులకు నా ప్రగాఢ సానుభూతి. సారీ ప్రణయ్‌’ అని మనోజ్ స్పందించాడు.