దాస‌రికి ఫాల్కే ఇచ్చి తీరాలి

Tollywood demands Phalke award for Dasari Narayana Rao
Saturday, June 10, 2017 - 18:00

ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నార‌య‌ణ రావు తెలుగు సినిమా రంగానికి చేసిన సేవ‌కి ఆయ‌న‌కి ఈపాటికే దాదాసాహేబ్ ఫాల్కే అవార్డు వ‌చ్చి ఉండాల్సింది. ఇప్ప‌టికైనా ఫాల్కే అవార్డును ప్ర‌భుత్వం ప్ర‌క‌టించాల‌ని టాలీవుడ్ ప్ర‌ముఖులంతా డిమాండ్ చేశారు. దాస‌రి సంస్మ‌ర‌ణ స‌భ ఈ రోజు ఫిల్మ్‌చాంబ‌ర్‌లో నిర్వ‌హించింది తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌. మెగాస్టార్ చిరంజీవి స‌హా ప‌లువురు సెల‌బ్రిటీలు విచ్చేశారు.

చిరంజీవి
దాసరి కడసారి చూపునోచుకోకపోవడం నా జీవితానికి అసంతృప్తిగా ఉంది. అయితే దాసరి కడసారి ఆశీస్సులు పొందడం ఆనందంగా ఉంది. 
ఖైదీ నెంబర్ 150 ఆడియో కి గెస్ట్ గా వచ్చారు. ఆయన చివరిసారి మీడియా ముందు మే 4 న మాట్లాడరు. ఈ రెండు సార్లు నేను ఉండ‌టం
జరిగింది. ఆయనకు నేనంటే ఎంతో ప్రేమ. ఆయన నా పట్ల ఎప్పుడూ పితృవాత్సల్యం చూపేవారు. హాస్పటల్ లో ఖైదీ నెంబర్ 150 కలెక్షన్స్ ఎంత అని పేపర్ మీద రాసి అడిగారు. అది ఈ జన్మ లో మర్చిపోలేను.  ఈ మధ్య పాలకొల్లు నుండి వచ్చాయి అని బొమ్మిడాయిల కూర వేసి దాసరి గారే తినిపించారు. నాకే కాదు ప్రతీ కార్మికుడూ ఒక తండ్రి లాంటి వ్యక్తి. ఆయన లేని లోటు భర్తీ చేయలేనిది.  

అల్లు అరవింద్
దాసరి గారు చనిపోయినప్పుడు మా ఫ్యామిలీ ఇండియాలో లేదు. ఆయన చివరి చూపు చూడలేకపోయాం. నేను ఇండస్ట్రీ కి రావడానికి
పరోక్షంగా దాసరి గారే కారణం. నేను నిర్మాతగా పరిచయమయ్యింది దాసరి తీసిన‌ బంట్రోతు భార్య తోనే. ప్రతి చిన్నవాడు కొట్టగలిగే తలుపు దాసరి గారి ఇంటి తలుపు.

గంటా శ్రీనివాసరావు, మంత్రి
దర్శకుడు అనే ప‌దానికి ఒక ప్రైడ్ తెచ్చిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది దాసరినే.

ఆర్.నారాయణ మూర్తి
మద్రాసు నడిబొడ్డులో ఇక నేను ఉండలేను అనుకొన్న సమయం లో తమ్ముడూ  నీ చదువు పూర్తి చేసుకుని రా నీకు వేషం ఇస్తా అన్నారు. అలాగే నన్ను నటుడిగా నిలబెట్టిన మహావ్యక్తి ఆయన. ఒక మహోన్నత వ్యక్తిత్వానికి రూపం ఆయన. కృష్ణ గారి అబ్బాయి రమేష్ హీరో గా నటించిన నీడ సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు. నీ కులం ఏంటి ,నీ మతం ఏంటి అని ఏమి అడగకుండా అవకాశం ఇచ్చారు. సినిమా దర్శకుడు గా ,పత్రికేయుడిగా, రాజకీయ నాయకుడు గా మూడు ముఖాలు కలవాడు ఆయ‌న‌. దాసరి గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చి తీరాలి. దానికి పెద్దలు అందరూ సహకరించాలి.