వర్మపై వాణీవిశ్వనాథ్ ఫైర్

వాణీ విశ్వనాథ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందనేది పాత న్యూసే. మలబార్ తీరాన పుట్టిన ఈ కేరళ కుట్టి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో హల్‌చల్ చేయనుంది. త్వరలోనే అధికారికంగా టీడీపీలో చేరుతుంది. అయిత పార్టీలో చేరకముందే...ఆమె తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడేస్తోంది. రాంగోపాల్ వర్మపై విమర్శలు గుప్పించింది.
లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ చరిత్రని తీస్తున్నా అని వర్మ ప్రకటించినప్పటి నుంచి తెలుగుదేశం నేతలు తెగ వర్రీ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. అందులో భాగంగా ఇపుడు వాణీ విశ్వనాథ్ స్పందించింది.
"ఎన్టీఆర్ వీరాభిమానిగా , ఆయన సినిమా ఆఖరి హీరోయిన్ గా చెబుతున్నా ఎన్టీఆర్ బయోపిక్ ను తెరకెక్కించే ప్రయత్నం రాంగోపాల్ వర్మ వెంటనే మానుకోవాలి. ఎన్టీఆర్ పేరుకు కళంకం తెచ్చేలా సినిమా తీస్తే ఎన్టీఆర్ అభిమానులతో కలిసి వర్మ ఇంటి ముందు ధర్నాకు దిగుతా," అని ఆవేశంగా ప్రకటించింది వాణీ.
1992లో స్వర్గీయ నందమూరి తారకరామారావు తీసిన "సామ్రాట్ అశోక" సినిమాలో ఆమె ఎన్టీఆర్ సరసన నటించింది. ఆ తర్వాత ఎన్టీఆర్ "మేజర్ చంద్రకాంత్", "శ్రీనాథ కవిసార్వభౌమ" (చివరి చిత్రం) సినిమాల్లో నటించారు.
"దేవతలు ఎలా ఉంటారో తెలియదు, ఎన్టీఆర్ రూపం చూసి దేవుడు ఇలా ఉంటాడనుకున్నారు ప్రజలు. అలాంటి మహానుభావుడి జీవితాన్ని గొప్పగా తీయాలి. రాంగోపాల్ వర్మ తీసే సినిమా పేరులోనే ఫక్తూ వ్యాపార కోణం ఉంది. వివాదం దాగి ఉంది.ఇది పద్దతి కాదు, ప్రజలు తట్టుకోలేరు," అంటూ వాణీ విశ్వనాథ్ విరుచుకుపడ్డారు.
అంతేకాదు నిజమైన బయోపిక్ బాలయ్య మాత్రమే తీయగలడన్న నమ్మకం ఉందన్నారు వాణి. "ఎన్టీఆర్ బయోపిక్ ను బాలకృష్ణ తీస్తే కొడుకుగా ఎన్టీఆర్ ను దేవుడు లా చూపిస్తాడన్న నమ్మకం ఉంది.
రాంగోపాల్ వర్మ సినిమా పై అనుమానం ఉంది," అని వాణి పేర్కొంది.
సో.. వచ్చే ఎన్నికల్లో వాణీవిశ్వనాథ్‌కి ఎమ్మెల్యే సీట్ కన్‌ఫమ్ అయినట్లే.
- Log in to post comments