దాన‌య్య‌ని టార్గెట్ చేసిన శ‌క్తి ఎవ‌రు?

Who is spreading lies about producer Danayya?
Tuesday, July 17, 2018 - 23:00

భ‌ర‌త్ అనే నేను సినిమా స‌క్సెస్‌ఫుల్‌గా 50 రోజులు పూర్తి చేసుకొంది. మ‌హేష్‌బాబు కెరియ‌ర్‌లో ఆల్‌టైమ్ నెంబ‌ర్‌వ‌న్‌గా నిలిచింది. నిర్మాత‌, ద‌ర్శ‌కుడు, బ‌య్య‌ర్లు...అంద‌రూ ఎపుడో త‌మ లావాదేవీల‌ను సెటిల్ చేసుకున్నారు. ఆ సినిమాకి సంబంధించి అకౌంట్స్ క్లోజ్ అయి చాలా కాల‌మయింది. మ‌రి స‌డెన్‌గా ఇపుడు దానయ్య‌కి వ్య‌తిరేకంగా ఎందుకు ప్రచారం మొద‌లైంది?

డైర‌క్ట‌ర్‌కి, హీరోయిన్‌కి, అలాగే మ‌రో ఇద్ద‌రు సాంకేతిక నిపుణుల‌కి దాన‌య్య పారితోషికం ఎగ్గొట్టాడ‌నే వార్త రావ‌డ‌మే విచిత్రంగా ఉంది. అయిపోయిన పెళ్లికి ఏదో అన్న‌ట్లు దాన‌య్య‌కి వ్య‌తిరేకంగా ప్ర‌చారం షురూచేయ‌డం వెనుకున్న అస‌లు లోగుట్టు ఏంటి?

దాన‌య్య‌తో ఎలాంటి పేచీ లేద‌ని ద‌ర్శ‌కుడు కొర‌టాల ఇప్ప‌టికే క్లారిటీ ఇచ్చాడు. హీరోయిన్ కియారా అద్వానీ ఏకంగా త‌న త‌రుఫున ప్రెస్‌నోట్ విడుద‌ల చేసింది. దాన‌య్య బంగారం అని చెప్పింది. ఆమె దాన‌య్య ప్రొడ‌క్ష‌న్‌లోనే ఇంకో సినిమా చేస్తోందిపుడు. మ‌రి దాన‌య్య‌కి చెడ్డ పేరు వస్తే లాభ‌ప‌డేది ఎవ‌రు? ఆయ‌న్ని టార్గెట్ చేసిన శ‌క్తి ఏంటి? ఎవ‌రికావ‌స‌రం ఉంది?

దీని వెనుకున్న శ‌క్తి ఏంటో దాన‌య్య ఇప్పటికే తెలుసుకున్నాడ‌ట‌. కానీ ఆ శ‌క్తి గురించి మాట్లాడితే లేనిపోని స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అందుకే నిశ్శ‌బ్దంగా ఉన్న‌ట్లు స‌మాచారం. ఆ ప్ర‌చారం రావ‌డానికి కార‌ణం ఏంటో కూడా దాన‌య్య‌కి తెలిసింది.