వర్మకి అంత దమ్ముందా?

ఎన్టీఆర్ జీవితాన్ని వెండితెరపైకి తీసుకొస్తానని ప్రకటించాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఎన్టీఆర్ శత్రువులెవరో, నమ్మక ద్రోహులెవరో, కాంట్రవర్సీల వెనకున్న అసలు మేటరేంటో.. ఇలా అన్నీ అశేష తెలుగు ప్రజానీకానికి చూపిస్తాననని తనదైన స్టయిల్ లో చెబుతున్నాడు వర్మ. కానీ వర్మకు అంత దమ్ముందా అనేదే ఇక్కడ మెయిన్ టాపిక్.
పరిటాల జీవితాన్ని మొత్తం చూపించేస్తానని గొప్పలు చెప్పిన వర్మ... రక్తచరిత్ర 1, రక్తచరిత్ర 2 అంటూ ఏకంగా 2 భాగాలు వదిలాడు. కానీ అందులో తెరవెనక సంగతులు చూపించింది మాత్రం చాలా తక్కువ. ఏఏ అంశాలను వర్మ చెబుతాడని ప్రేక్షకులు బాగా ఎదురుచూశారో.. ఆ అంశాల్ని కావాలనే పక్కనపెట్టాడు. అందుకే రక్తచరిత్ర మొదటి భాగం హిట్టయినా రెండో భాగం తుస్సుమంది. మొన్నటికి మొన్న వంగవీటి సినిమా విషయంలో కూడా రాధ బయోపిక్ అంటూ పైపైన కథ అల్లి ఏదో చెప్పేశాడు.
ఇలాంటి వర్మ ఇప్పుడు ఎన్టీఆర్ జీవితంలో అసలైన కోణాల్ని ఆవిష్కరిస్తానంటున్నాడు. నమ్మక ద్రోహుల్ని బయటపెడతానంటూ స్టేట్ మెంట్స్ ఇస్తున్నాడు. అసలైన వివాదాలు ఏంటో కళ్లకు కడతానంటూ శపథాలు చేస్తున్నాడు. వంగవీటి, పరిటాల విషయంలో చేయలేని వర్మ.. ఏకంగా లెజెండ్ ఎన్టీఆర్ విషయంలో ఫ్రీ హ్యాండ్ తీసుకుంటాడంటే ఎవరూ నమ్మరు.
ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి సంబంధించిన 1995 ఆగస్ట్ ఉదంతాన్ని వర్మ ఉన్నదున్నట్లు చూపించగలడా? కీలకమైన వైస్రాయ్ హోటల్ సంఘటనలో ఆయన ఎవర్నీ విలన్‌గా చూపిస్తాడు? ప‌్రస్తుతం మీడియాలో వస్తున్న వార్తలను బట్టి ఆయన బాలయ్య హీరోగా ఈ మూవీని తీయనున్నాడు. బాలయ్యని హీరోగా పెట్టి వైస్రాయ్ ఎపిసోడ్‌ని నిజాయితీగా తీయగలడా? చంద్రబాబునాయుడికి వ్యతిరేకంగా ఒక్క సీన్ కూడా చూపించగలడా? అంత ధైర్యం వర్మకి ఉందా? ఆయన మీడియాలో చేసే స్టేట్‌మెంట్స్‌కి, సినిమాలో చూపించే దానికి ఆకాశానికి, భూమికి ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది (జమీన్ ఆస్మాన్ ఫరక్).
కేవలం ఎన్టీఆర్ ను మరోసారి లెజెండ్ గా మాత్రమే చూపించగలడు వర్మ. ఈపాటి దానికి వివాదాలు, నమ్మకద్రోహులు, చీకటి కోణాలు లాంటి భారీ పదాలు వాడి లేనిపోని హైప్ ఎందుకో? ఇది నిజంగా బయోపిక్ కాగలదా? వర్మ మార్క్ ఎన్టీఆర్ చరిత్ర అవుతుందేమో.
- Log in to post comments