న‌వ‌లాసినిమా రారాణి

Yaddanapudi Sulochana Rani: Queen of novel-movies!
Monday, May 21, 2018 - 16:15

య‌ద్ద‌న‌పూడి సులోచ‌నారాణి ఇక లేరు. 79వ ఏటా ఆమె క‌న్నుమూశారు. య‌ద్ద‌న‌పూడి అంటే న‌వ‌లార‌చ‌యిత‌గానే చాలా మందికి తెలుసు. కానీ ఎన్నో హిట్ సినిమాల‌కి క‌థావ‌స్తువు ఆమె న‌వ‌ల‌లే అని ఈ త‌రానికి అంత‌గా తెలియ‌దు.

యద్దనపూడి సులోచనారాణి 1940లో కృష్ణా జిల్లా మొవ్వ మండలములోని కాజ గ్రామములో జన్మించారు. 1963లో ఆదుర్తి తీసిన‌ చదువుకున్న అమ్మాయిలు చిత్రం ..ఆమెకి క‌థార‌చ‌యిత‌గా తొలి చిత్రం. 1965లో మనుషులు - మమతలు సినిమాకు కథను అందించారు.  ఆ తరువాత  మీనా, జీవన తరంగాలు, సెక్రటరీ, రాధా కృష్ణ, అగ్నిపూలు, చండి ప్రియా, ప్రేమ లేఖలు, బంగారు కలలు, విచిత్ర బంధం, జై జవాన్, ఆత్మ గౌరవం..వంటి ప‌లు సినిమాలు వ‌చ్చాయి.

ఇందులో ఎక్కువ‌శాతం అక్కినేని నాగేశ్వర రావే హీరోగా న‌టించారు.

ఆమె క‌థ‌ల్లో క‌థానాయిక‌లు ఆత్మాభిమ‌నం క‌లిగిన వారుగా ఉండేవారు. మీనా చిత్రంలో క‌థానాయిక ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్‌. ఇదే క‌థ‌ని ఇటీవ‌ల త్రివిక్ర‌మ్ అ ఆ సినిమాగా మ‌లిచారు. ఆమె క‌థ‌ల్లో క‌థానాయ‌కులు ధ‌న‌వంతులుగా ఉండ‌డం ప‌రిపాటి. సెక్ర‌టరీ సినిమా చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణ‌. ప‌డ‌వ‌లాంటి కారులో హీరో ఇంట్ర‌డిక్ష‌న్‌...వంటివి కామ‌న్ ఫీచ‌ర్‌. ఈ విష‌యంలో ఆమె విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నా.. ఒక త‌రం మ‌హిళ‌ల‌కి న‌చ్చే ర‌చ‌న‌లు చేసి న‌వ‌లారారాణి అనిపించుకున్నారు.

ఆమె రచనలు కేవలం సినిమాలుగానే కాక అనేక టీ.వీ ధారావాహికలుగా -  ఆగమనం, అగ్నిపూలు, కెరటాలు, సుకుమారి, ఋతురాగాలు, నీరాజనం, వంటివి ప్ర‌సారం అయ్యాయి.