సినిమా జీవితాలపై వైవిఎస్ ఓపెన్ లెటర్

కొంతకాలంగా దర్శకుడు వైవిఎస్ చౌదరి సినిమాలకి దూరంగా ఉంటున్నారు. రేయ్ సినిమా ఫ్లాప్ తర్వాత ఆయన మరో మూవీ చేయలేదు. రీసెంట్‌గా వైవిఎస్ మరో లవ్‌స్టోరీ తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇపుడు ఆయన వార్తల్లో నిలిచాడు ఒక లేఖ రూపంలో. ప్రస్తుతం టాలీవుడ్ ఎదుర్కొంటున్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన సినిమావాళ్ల జీవితాలను అద్దాల మేడ జీవితాలతో పోల్చాడు. ఆయన రాసిన లేఖని చూడండి..
మేము అడుక్కున్నా అతిశయమే, అడుక్కోకున్నా అతిశయమే,
మేము కొంచెం చేసినా 'అతి'శయమే, కొంచెమే చేసినా 'అతి'శయమే,
అస్సలు మేమేంచేసినా, చేయకున్నా ప్రతివాడి గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే/స్పందిస్తూనే ఉంటాం.
ప్రతీ శుక్రవారం మా జీవనరేఖలు, జీవనసూత్రాలు, మా జీవితగమ్యాలు మారుతూనే ఉంటాయి. అలా ప్రతీ సంవత్సరంలో 52 సార్లు మార్పులకు, చేర్పులకు, కూర్పులకు అలవాటుపడ్డవాళ్ళం. ధైర్యసాహసాలను, కుట్రలూకుతంత్రాలను రచించగల/ప్రదర్శించగల కధానాయకులం, ప్రతినాయకులం. దానధర్మాలు, త్యాగాలు చేయగల మానవతావాదులం. మంచీ-చెడులు, గెలుపూ-ఓటమిలు, పొగడ్తలూ-ప్రశంసలు, నిందాపనిందలు మమ్మల్నెప్పుడూ వెంటాడే 'నీడ'లాంటి నేస్తాలు. మేము అందరికీ కావాల్సినవాళ్ళం, మా అవసరాలకి మాత్రం అందరికీ కానివాళ్ళం. ఏ మాధ్యమాలకైనా, ఏ విషయానికైనా మేమే అవసరం, మేమే ప్రధమలం. మేము 'అల'లాంటి వాళ్ళం. 'అల'లాగా నిశ్చింతగా నిశ్చలంగా బతకడం చేతకానివాళ్ళం. కానీ, 'అల'లాగా పడినా లేవగల సత్తా ఉన్నవాళ్ళం. మేము దేనినైనా స్వీకరించగలం, దేనినైనా భరించగలం. దేనికైనా వెనకాడని దమ్ముగలవాళ్ళం. ఎంత మంది ఎన్ని అన్నా, అనుకున్నా 'కళ' పట్ల, 'కళాకారుల' పట్ల వ్యామోహాన్ని ఆపలేరు, 'కళాకారులు' లోని తృష్ణని తగ్గించలేరు. ప్రపంచం ఎప్పుడూ వర్తమానంలోనే బ్రతుకుతుంది తప్ప, గతాన్ని గుర్తుకు తెచ్చుకునే ఓపికా ఉండదు, భవిష్యత్తు గురించి బెంగపడే తీరికా ఉండదు.
కాలప్రవాహంలో ఇప్పడు సంచరిస్తున్న వార్తలన్నీ రేపటికి సద్దికూడు. ఎల్లుండికి విసిరేసిన విస్తరాకు. క్లుప్తంగా.. ఈ వర్తమానమంతా రేపటికి ఇంగువ కలిపిన కమ్మని పులిహోర (Exaggerated News), ఎల్లుండికి అందరూ వదిలించుకుందామనే అశుద్ధం.
PS: ఇప్పుడు తెలుగు 'వెండితెర'పై కమ్మిన కారుమబ్బుల గురించి, నా ఈ గోడు మీ అందరికీ అర్ధమయ్యుంటుందని ఆశిస్తూ.. వై వి ఎస్ చౌదరి.
- Log in to post comments