చిరు పిక్చ‌ర్ అభీ బాకీ హై..!

Chiranjeevi will campaign for AP Congress in 2019?
Monday, July 30, 2018 - 18:00

మెగాస్టార్ చిరంజీవి పొలిటిక‌ల్ ఇన్నింగ్స్ ముగిసింద‌ని అంద‌రూ భావిస్తున్నారు. ఎందుకంటే ఆయ‌న రాజ‌కీయాల్లో కొన్నాళ్లూగా యాక్టివ్‌గా లేరు. కాంగ్రెస్ పార్టీ క‌లాపాల‌కి దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. ఖైదీ నెంబర్ 150తో స‌క్సెస్‌ఫుల్‌గా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఇపుడు హాయిగా సినిమాలు చేసుకుంటున్నారు. అంతేకాదు, ఆయ‌న రాజ్య‌స‌భ ప‌ద‌వీకాలం కూడా ముగిసింది. ఇపుడు ఆయ‌న మాజీ ఎంపీ మాత్ర‌మే.

రాజ‌కీయాలు త‌న‌కి స‌రిప‌డ‌వ‌ని చిరంజీవి ఇప్ప‌టికే ఫిక్స్ అయ్యారు. అందుకే మెగాస్టార్ వాటికి దూరంగా ఉంటున్నారు. ఐతే ఇది త‌ప్ప‌ని చెపుతున్నారు కాంగ్రెస్ నాయ‌కులు. చిరంజీవి ఇప్ప‌టికీ కాంగ్రెస్‌లోనే ఉన్నార‌నీ, వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తార‌ని అంటున్నారు.ఈసారి ఏపీలో కాంగ్రెస్ తరఫున చిరంజీవి విస్తృతంగా ప్రచారం చేస్తారని ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి అంటున్నారు. రాహుల్ గాంధీ స్వ‌యంగా అడిగితే చిరు కాదంటారా అంటూ రఘువీరా ప్ర‌శ్నిస్తున్నారు.

ఇది చాలా విచిత్రంగా ఉంది. ఇప్ప‌టికే రామ్‌చ‌ర‌ణ్‌, నాగ బాబు, అల్లు అర్జున్‌...త‌మ కుటుంబ స‌భ్యుల మ‌ద్ద‌తు జ‌న‌సేన పార్టీకే అని ప్ర‌క‌టించారు. బాబాయ్ ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌ర‌ఫున ప్ర‌చారానికి కూడా రెడీ అని చ‌ర‌ణ్ అనౌన్స్ చేశాడు. మెగా కుటుంబం అంతా జ‌న‌సేన‌కి స‌పోర్ట్‌గా నిలిచి జ‌నాల‌ని ఓట్లు వేయ‌మ‌ని అడుగుతుంటే.. మెగాస్టార్ కాంగ్రెస్ త‌ర‌ఫున ఎన్నిక‌ల ప్ర‌చారం చేయ‌గ‌ల‌డా?