ఒక జీవితము... రెండు భాగములు... పలు సందేహములు

NTR Biopic: Will it be truthful to the great man's real life?
Thursday, October 4, 2018 - 22:30

మహా నటుడు ఎన్టీఆర్ జీవితం వెండి తెరపై ఆవిష్కృతం అవుతుందనగానే... తెలుగు ప్రేక్షక లోకం ఎంతో ఆసక్తిగా, అభిమానంగా వేచిచూస్తుంది అనడంలో ఎలాంటి సందేహం ఉండదు. ఎందుకంటే రాముడైనా... కృష్ణుడైనా... శివుడైనా... వేంకటేశ్వర స్వామి అయినా ఆ పాత్రకు ఎన్టీ రామారావు మాత్రమే జీవంపోయగలరు. ఆ దేవతామూర్తులు ఎన్టీఆర్ లాగే ఉంటారేమో అనిపిస్తుంది. 

దుర్యోధన, రావణ బ్రహ్మ పాత్రలకీ హీరోయిక్ ఇమేజ్ తీసుకొచ్చిన ఘనత ఆయనకే సొంతం. నటుడిగా ఆయన ప్రాంతాలకి అతీతంగా తెలుగువారి అందరి అభిమానాన్నీ దక్కించుకున్నారు. వెండితెర నుంచి రాజ‌కీయ‌ యవనికపైకి తెలుగువారి ఆత్మ గౌరవ నినాదంతో వచ్చి అధికార పీఠంపై కూర్చొన్నారు. ఎన్టీఆర్ బయో పిక్ నిర్మాణం మొదలు కావడానికి ముందునుంచీ ఆసక్తి మొదలైంది. 

ఎన్టీఆర్ నట వారసుడు బాలకృష్ణ ఆ పాత్ర పోషిస్తారు అనేది ఎలాగూ ఫిక్స్ అయ్యారు. ఇతర పాత్రల విషయంలో ఆసక్తి నెలకొంది. అదీ క్రమంగా ఎవరు ఏమిటో చిత్ర బృందమే వెల్లడిస్తూ వచ్చింది. బసవ తారకంగా విద్యా బాలన్ కనిపిస్తుంది. ఇక చంద్రబాబుగా రానా నటిస్తారని చెప్పగానే అందరూ అతను జీవంపోయగలడని నమ్మారు. బాహుబలిలో బళ్లాలదేవగా ప్రతినాయకుడిగా, సోదరుడి వెన్నుపోటు పొడిచి గద్దె దక్కించుకున్న పాత్రకు జీవం పోశారు. చంద్రబాబు పాత్రకు చేసిన మేకప్ అందరికీ నచ్చింది. 

సంక్రాంతికి ఎన్టీఆర్ బయో పిక్ తొలి భాగం ‘కథానాయకుడు’గా, రెండో భాగం ‘మహానాయకుడు’ రాబోతున్నాయి  అని గురువారం వెల్లడించారు. ఇచ్చిన స్టిల్స్ చూస్తే మొదటి భాగంలో ప్రధానంగా సినీ హీరో ఎన్టీఆర్ జీవితం చూపిస్తారు అనుకోవాలి. రెండో భాగం రాజకీయాలు చూపిస్తారు కాబోలు. మరి మొదటి భాగంలో కేవలం వెండితెర మెరుపులే చూపిస్తే ఏ మేరకు కిక్ వస్తుందో చూడాలి. 

పరిశ్రమలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం – నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు ఘట్టం దగ్గర తొలి భాగం ముగుస్తుంది. రెండో భాగంలో నాదెండ్ల వెన్నుపోటును ఎన్టీఆర్ ఎలా ఎదుర్కొని, తిరిగి ప్రజా విజయం సాధించారు, ఆ తరవాత రాజకీయాల్లో మహా నాయకుడిగా ఎదిగారో చూపిస్తారు అని తెలుస్తోంది. ఈ భాగంలోనే చంద్రబాబు రాజకీయ చాణక్యం కనిపిస్తుంది.

నాదెండ్ల వెన్నుపోటు చూపించే మేకర్లు – ఎన్టీఆర్ జీవన సంధ్యలో లక్ష్మీపార్వతిని చేసుకున్న రెండో వివాహ ఘట్టం చూపిస్తారా లేదా? అలా పెళ్లి చేసుకోవడానికి దారి తీసిన పరిస్థితులు, లక్ష్మీపార్వతితో అనుబంధం, తిరుపతి సభలో ఎన్టీఆర్ తన వివాహం గురించి ప్రకటన చేయడం, అప్పుడు చంద్రబాబు అసంతృప్తి చెందడం లాంటివి కథలో మలుపులుగా ఏమైనా చూపిస్తారా?

ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో రెండు వెన్నుపోట్లు ఉన్నాయని అందరికీ తెలిసిందే. మొదటిది నాదెండ్ల అయితే... రెండో వెన్నుపోటు అల్లుడు చంద్రబాబు నుంచే ఎదుర్కొన్నారు. ఇందుకు ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలూ సహకరించారు. ఇందుకుగల ఎమోషనల్ కారణాలనూ దర్శకుడు క్రిష్ చూపిస్తారా?

ఆ మహానటుడు, మహానాయకుడు జీవితంలో కీలకమైన ఘట్టాలు, మలుపులు, ఆరోహణ అవరోహణలు సెకండ్ హాఫ్ లోనే ఉన్నాయి. వాటిని కూడా నిజాయతీగా చూపిస్తారు అనుకొంటే (మన దగ్గర వస్తున్న బయో పిక్ ల్లో వ్యక్తి తాలూకు గొప్పతనాన్ని లార్జర్ దేన్ లైఫ్ సైజ్ లో చూపిస్తారు తప్ప వివాదాస్పద విషయాల జోలికి పోవడం లేదు. మహానటి, సంజూ అలాంటివే) – లక్ష్మీపార్వతి పాత్ర ఎవరు పోషిస్తున్నారు, నాదెండ్ల పాత్రలో ఎవరు కనిపిస్తారు, దగ్గుబాటి ఎవరు... లాంటి విషయాలను బయటపెట్టడం లేదు. 

అసలు ఇప్పటి వరకూ దగ్గుబాటి వేంకటేశ్వర రావు పాత్ర గురించి మేకర్లు నోరు ఎందుకు మెదపడం లేదు. ఒకవేళ ఈ బయో పిక్ ని బాల కృష్ణో, చంద్రబాబో ‘బొమ్మరిల్లు ఫాదర్’ లా క్రిష్ తో దర్శకత్వం చేయిస్తే సందేహాలకి సమాధానాలు దొరక్కపోవచ్చు. ఏది ఏమైనా ఎన్నో సందేహాల నడుమ వస్తున్న ఈ బయో పిక్ కోసం తెలుగు ప్రేక్షక లోకం ఆసక్తిగా వేచి చూస్తోంది.