క‌న్నీటిప‌ర్యంత‌మైన ఎన్టీఆర్‌

NTR breaks down at Aravindha Sametha event
Tuesday, October 2, 2018 - 22:30

జూనియ‌ర్ ఎన్టీఆర్‌, నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ త‌మ తండ్రిని త‌లుచుకొని భావోద్వేగానికి లోన‌య్యారు. అర‌వింద స‌మేత ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ త‌న తండ్రి హ‌రికృష్ణ‌ని గుర్తు చేసుకొని క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యాడు. క‌ల్యాణ్‌రామ్ కూడా త‌న తండ్రి మ‌ర‌ణాన్ని త‌లుచుకొని స్టేజ్‌పైనే ఏడ్చేశాడు. నంద‌మూరి హ‌రికృష్ణ ఇటీవ‌ల రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణించిన నెల రోజుల త‌ర్వాతే ఈ ఈవెంట్ జ‌రిగింది. 

జూనియ‌ర్ ఎన్టీఆర్ మొద‌ట ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌తో త‌న అనుబంధాన్ని వివ‌రించాడు. ఈ సినిమా చేయ‌డానికి ప‌రిప‌క్వ‌త రావాల‌ని కాబోలు త్రివిక్ర‌మ్‌, త‌న కాంబినేష‌న్ ఇంత లేట్ అయింద‌ని చెప్పాడు. త‌న తండ్రి మ‌ర‌ణం త‌ర్వాత త్రివిక్ర‌మ్ త‌న‌కి ఇచ్చిన అండ‌, తోడ్పాటు మ‌ర‌వ‌లేద‌ని, ఈ బంధం క‌ల‌కలం ఉండాల‌ని ఎమోష‌న‌ల్ అయిపోయాడు జూనియ‌ర్‌. ఇది గొప్ప చిత్రం అవుతుంది. ఈ సినిమాలో డ్యాన్స్‌కి కావాల్సిన పాట‌ల్లేవు, టైటిల్ అమ్మాయి మీద ఉంద‌ని కామెంట్స్ వ‌చ్చాయి. కానీ సినిమా చూస్తే అర్థ‌మ‌వుతుంది ఇది ఎలాంటి సినిమానో అని ఎన్టీఆర్ క్లారిఫికేష‌న్ ఇచ్చాడు. అలాగే త‌మ‌న్‌ని తెగ పొగిడేశాడు. 

గొప్ప సందేశం ఉన్న క‌థ ఇది. జీవించేందుకు పోరాడేవాడి క‌థ‌. ఈ గొప్ప క‌థ‌ని, ఈ సినిమాని అందించినందుకు త్ర‌విక్ర‌మ్‌కి థ్యాంక్స్ చెపుతున్నా. ఈ సినిమాలో డ్యాన్స్‌కి కావాల్సిన పాట‌ల్లేవ‌ని అంటున్నారు. కానీ నేను డ్యాన్స‌ర్ క‌న్నా ముందు న‌టుడ్ని. ఒక న‌టుణ్ని ఎలివేట్ చేసే సినిమా ఇది అని ఎన్టీఆర్ ఉద్వేగంగా చెప్పాడు.

ఇక హ‌రికృష్ణ మ‌ర‌ణించిన ఐదు రోజుల‌కే ఎన్టీఆర్ ఎందుకు షూటింగ్‌లో పాల్గొనాల్సి వ‌చ్చిందో క‌ల్యాణ్‌రామ్ చెప్పాడు.

"నాన్న నువ్వు ఎక్కడికి వెళ్లలేదు. మా గుండెల్లో ఉండిపోయావు. ‘ప్రొడ్యూసర్‌ బాగుండాలి. వృత్తి పట్ల నిబద్ధత ఉండాలి’ అని మాకు చెప్పావు. ఇప్పుడు మా అందరిలోనూ నువ్వు ఉన్నావు. ఇటీవల మా ఇంట్లో విషాదం జరిగినప్పుడు ‘అరవింద సమేత’కి సంబంధించి ఇంకా ముప్ప‌యి రోజుల షూటింగ్ ఉంది. సినిమా వాయిదా వేద్దామ‌ని ప్ర‌పోజ‌ల్ వ‌చ్చింది. ప్రొడ్యూసర్‌ బాగుండాలి. మనం ఇచ్చిన మాట మీద నిలబడాలని మా నాన్న పాల‌సీ ప్ర‌కారం ఐదో రోజే తమ్ముడు షూటింగ్‌కు వెళ్లాడు." అని కల్యాణ్‌రామ్ త‌న ఎమోష‌న‌ల్ స్పీచ్‌లో పేర్కొన్నాడు.