రామ్‌చ‌ర‌ణ్ రాజ‌కీయ వ్యాఖ్య‌లు

Ram Charan's political statement
Thursday, December 27, 2018 - 23:45

రామ్‌చ‌ర‌ణ్ కూడా పొలిటిక‌ల్ కామెంట్స్ చేయ‌డం మెల్ల‌మెల్ల‌గా నేర్చుకుంటున్నాడు. గురువారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన "విన‌య విధేయ రామ" ప్రీరిలీజ్ ఈవెంట్‌లో రామ్‌చ‌ర‌ణ్ రాజ‌కీయ వ్యాఖ్య‌లు చేయ‌డం అభిమానుల‌కి హుషారునిచ్చింది. ఇటీవ‌ల జ‌న‌సేన పార్టీకి చాయ్ తాగే గ్లాస్‌ని పార్టీ గుర్తుగా ప్ర‌క‌టించింది ఎన్నిక‌ల సంఘం. దాంతో టీగ్లాస్‌ని పాపుల‌ర్ చేయాల్సిన అవ‌స‌రం ఉంది జ‌న‌సేన‌కి. మ‌రి అభిమానులంతా వ‌చ్చిన‌పుడు ఆ వేదిక‌ని ఉప‌యోగించుకోకపోతే ఎలా. ఆ బాధ్య‌త‌ని చ‌ర‌ణ్ తీసుకున్నాడు.

‘"ఈ మధ్య ఎవరూ జ్యూస్‌లు, కాఫీలు తాగడం లేదు. అందరూ టీలే తాగుతున్నారు," అంటూ వ్యాఖ్య‌నించి అభిమానుల‌తో ఈల‌లు వేయించుకున్నాడు. టీ గ్లాస్ గురించి అలా చెప్పాడు. " ఈ చిన్న టీ కప్పు ఏదో ఒక పెద్ద తుపాన్ సృష్టిస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా," అని కూడా అన్నాడు. అలా జ‌న‌సేన పార్టీ గుర్తు ప్ర‌జ‌ల్లోకి వెళ్లేలా త‌న‌వంతు ప్ర‌య‌త్నం చేశాడుచెర్రీ.

అంతేకాదు, ఈ సినిమా ఈవెంట్‌కి తెలంగాణ రాష్ట్ర స‌మితి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ని ముఖ్య అతిథిగా ఆహ్వానించాడు. "సీఎం కేసీఆర్‌ విజన్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఉన్న వ్య‌క్తి కేటీఆర్‌. ఇపుడు గొప్ప విజ‌యం సాధించారు. ఇపుడు కేటీఆర్ మ‌రింత గొప్ప‌గా డెవ‌ల‌ప్ చేస్తార‌ని న‌మ్ముతున్నా," అని కూడా కేటీఆర్‌పై ప్ర‌శంస‌లు కురిపంచాడు చెర్రీ.