వ‌ర్మ‌, తేజ‌...సేమ్ రూట్‌లో

Ram Gopal Varma and Teja treading the same path
Monday, October 23, 2017 - 16:15

రాంగోపాల్ వ‌ర్మ నెక్స్‌ట్ సినిమా..నాగార్జున‌తో. ఆ త‌ర్వాత ల‌క్ష్మీపార్వ‌తి కోణంలో ఎన్టీ రామారావు బ‌యోపిక్‌.

తేజ త‌దుప‌రి చిత్రం.. వెంకటేష్‌తో. ఆ తర్వాత ఎన్టీ రామారావు బ‌యోపిక్‌.

గురుశిష్యులు రాంగోపాల్ వ‌ర్మ‌, తేజ ఇలా పోటాపోటీగా సాగుతున్నారు. ఇద్ద‌రూ ఒకేసారి ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర‌ని అనౌన్స్ చేశారు. ఇద్ద‌రూ ఆ సినిమాకి ముందు మ‌రో సినిమా చేస్తామంటున్నారు.

"ల‌క్ష్మీస్ ఎన్టీఆర్" అనే సినిమాని ప్ర‌క‌టించి క‌ల‌క‌లం క్రియేట్ చేశాడు వ‌ర్మ‌. అయితే ఎపుడైతే తేజ‌.. ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర‌ని కొంత లేట్‌గా తీస్తాన‌ని అన్నాడో అపుడు వ‌ర్మ నాగార్జున సినిమా అనౌన్స్ చేశాడు. నవంబ‌ర్‌లో నాగార్జున హీరోగా ఒక యాక్ష‌న్ సినిమా తీసి... మార్చిలో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా మొద‌లుపెడుతాడ‌ట‌. వ‌ర్మ‌కిది పెద్ద స‌మ‌స్యే కాదు. ఐనా ఐదు రోజుల్లోనే దొంగ‌ల‌ముఠా అనే సినిమా తీశాడు. నాగార్జున మూవీని మూడు నెల‌లు సులువుగానే ఫినిష్ చేయ‌గ‌లడు.

ఇక వెంక‌టేష్‌తో వ‌చ్చే నెల‌లో సినిమాని షురూ చేస్తున్నాడు తేజ‌. ఇది కంటిన్యూ చేస్తూనే వ‌చ్చే ఏడాది ప్రారంభంలో బాల‌య్య క‌థానాయ‌కుడిగా ఎన్టీఆర్ బ‌యోపిక్ ప్రారంభిస్తాడ‌ట‌. తేజ ఇలా ఒకేసారి రెండు సినిమాలు చేయ‌గ‌ల‌డా అనేది డౌటే. పైగా ఎన్టీఆర్ సినిమాని ఆషామాషీగా తీయ‌కూడ‌దు. మ‌రి తేజ ఏం చేస్తాడో ఏమో అన్న డౌట్స్ ఫ్యాన్స్‌లో మొద‌ల‌య్యాయి.

ఒక‌పుడు వ‌ర్మ వ‌ద్ద అసిస్టెంట్‌గా వ‌ర్క్ చేశాడు తేజ‌. ఇపుడు ఇద్ద‌రూ పేరొందిన ద‌ర్శ‌కులుగా స్థిర‌ప‌డ్డారు. కానీ ఇద్ద‌రూ ఎన్టీఆర్ బ‌యోపిక్ అంటూ ఒక‌టే సోష‌ల్ మీడియాలో గోల చేస్తున్నారు.