బాల‌య్య‌ని ఇరుకున పెట్టిన వ‌ర్మ‌

RGV puts Balakrishna in tricky position
Monday, September 18, 2017 - 14:45

ముద్దొచ్చిన‌పుడే (త‌న‌ని) చంక‌నెత్తుకోవాలి అనుకుంటాడు ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌. అలా జ‌ర‌గ‌క‌పోతే ఆయ‌న‌కి తిక్క‌రేగుతుంది. ఆ త‌ర్వాత ..అంతే సంగ‌తులు. మొన్న‌టి వ‌ర‌కు బాల‌య్య‌ని తెగ పొగిడాడు వ‌ర్మ‌. ఇపుడు బాల‌య్య‌కి, ఆయ‌న‌కి ప‌డ‌ట్లేదు. దానికి కార‌ణం ఏంటంటే.. ఎన్టీఆర్ బ‌యోపిక్‌ని తీసే అవ‌కాశం వ‌ర్మ‌కి ఇవ్వ‌డం లేదు నంద‌మూరి బాల‌య్య‌.

ఎన్టీఆర్ బయోపిక్ తనే చేస్తానని ప్రకటించేసాడు వ‌ర్మ‌. బాల‌య్య కూడా చూచాయ‌గా అదే మాట మీడియాకి తెలిపాడు. అయితే నంద‌మూరి అభిమానులు మాత్రం గ‌గ్గోలు పెట్టారు. వ‌ర్మ తీస్తే అది బ‌యోపిక్ కాదు భ‌యోపిక్ అవుతుంద‌ని ఓపెన్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చారు. దాంతో బాలయ్య వెన‌క్కి త‌గ్గాడు. ఇంకా ద‌ర్శ‌కుడిని ఖ‌రారు చేయ‌లేద‌ని బాల‌య్య వేరే మాట చెప్పాడు. దాంతో వ‌ర్మ‌కి మేట‌ర్ అర్థ‌మైంది. బ‌యోపిక్ సీన్‌లో తాను లేన‌ని క్లియ‌ర్‌గా తెలిసిపోయింది. సో...నిన్న అర్ధ‌రాత్రి వ‌ర్మ‌ కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. 

లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే పేరుతో ఎన్టీఆర్ చరిత్ర‌ని తీస్తాన‌ని ప్ర‌క‌టించాడు వ‌ర్మ‌. అంటే చంద్ర‌బాబుకి, బాల‌య్య‌కి బ‌ద్ద విరోధి అయిన ఎన్టీఆర్ రెండో భార్య ల‌క్ష్మీపార్వ‌తి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయ‌న ఎన్టీఆర్ బ‌యోపిక్‌ని తీస్తాడ‌ట‌. అలా బాల‌య్య‌ని ఇరుకున పెట్టాడు.

ఈ ఏడాది సంక్రాంతి టైమ్‌లో బాల‌య్య‌ని ఆకాశానికెత్తాడు వ‌ర్మ‌. గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమా చేసి బాల‌య్య తెలుగు సినిమాని ఎక్క‌డికో తీసుకెళ్లాడని అని పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించాడు. అంతేకాదు... అమితాబ్ బ‌చ్చ‌న్ - బాల‌య్య మ‌ధ్య త‌న సర్కార్ 3 సినిమా సెట్‌లో స్పెష‌ల్ మీటింగ్ ఏర్పాటు చేయించాడు. రైతు సినిమాలో కీల‌క పాత్ర చేయాల‌ని బాల‌య్య అమితాబ్‌ని కోరాడు కానీ అది వ‌ర్క‌వుట్ కాలేదు. ఇపుడు సీన్ మార‌డంతో వ‌ర్మ ...బాల‌య్య‌కి త‌న స్ట‌యిల్ ఆఫ్ ట్రాలింగ్ ఏంటో చూపిస్తున్నాడు.