ఆర్ఎక్స్‌100 ఇంకా ఎంత క‌లెక్ట్ చేస్తుంది?

RX100: How much more it would collect?
Friday, July 20, 2018 - 22:30

ఒక చిన్న సినిమా 10 కోట్ల థియేట‌ర్ వ‌సూళ్ల‌ను సంపాదించ‌డం అంటే మాములు మేట‌ర్ కాదు. కొత్త తార‌ల‌తో కొత్త ద‌ర్శ‌కుడు కొత్త నిర్మాత తీసిన "ఆర్ఎక్స్ 100" షేర్ ఇప్ప‌టికే 9 కోట్ల రూపాయ‌ల‌ ద‌గ్గ‌రికి వ‌చ్చింది. ఒక నైజాంలోనే 4 కోట్ల షేర్‌ని దాటింది. మొత్తం ర‌న్ పూర్త‌య్యేస‌రికి ఎంత వ‌సూల్ చేయ‌గ‌లదు?

ట్రేడ్ పండితుల అంచ‌నా ప్ర‌కారం ఈ సినిమా రూ. 14 నుంచి రూ.15 కోట్ల వ‌ర‌కు రాబ‌ట్టగ‌ల‌ద‌ని అంచ‌నా.  నైజాంలో ఏడు కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు, ఉత్త‌రాంధ్ర‌లో కోటిన్న‌ర వ‌ర‌కు, సీడెడ్‌లోనూ కోటిన్న‌ర వ‌ర‌కు రాబ‌డుతుంద‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అంటే పెళ్లి చూపులు సినిమా కంటే పెద్ద హిట్ అవుతుంది ఈ మూవీ. 

సినిమా ద్వితీయార్థంలోని ట్విస్ట్‌, చివ‌రి అర‌గంట పాటు సాగిన స‌న్నివేశాలు బాగా క‌నెక్ట్ అవుతున్నాయ‌ని బ‌య్య‌ర్లు చెపుతున్నారు. అందుకే యూత్ నుంచి రిపీట్ ఆడియెన్స్ మొద‌ల‌య్యార‌ట‌. దానికి తోడు కొత్త సినిమాలేవీ దీనికి బ‌లంగా పోటీ ఇచ్చేలా లేవు. ఆ విధంగా ఈ సినిమా మినిమం 14 కోట్ల షేర్ రాబడుతందంటున్నారు.

"ఆర్ఎక్స్ 100" సినిమాకి ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి. ఇత‌ను రాంగోపాల్ వ‌ర్మ శిష్యుడు. కార్తీకేయ‌, పాయ‌ల్ రాజ్‌పుత్ జంట‌గా న‌టించారు. కార్తీకేయ‌కి కూడా ఆఫ‌ర్లు పెరిగాయి. పాయ‌ల్ రాజ్‌పుత్‌కిలాంటి డేరింగ్ క్యార‌క్ట‌ర్లే వ‌స్తున్నాయ‌ట‌. ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి ఇప్ప‌టికే నలుగురు బ‌డా నిర్మాత‌ల వ‌ద్ద అడ్వాన్స్‌లు తీసుకున్నాడు.