కేసీఆర్, పవర్‌స్టార్ భేటీ వెనుక స్పెషల్ రీజన్ ఉందా?

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఎపుడూ సర్‌ప్రైజ్‌లు ఇస్తూనే ఉంటారు. కొత్త సంవత్సరం తొలి రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో జనసేన అధినేత గంటన్నర సేపు భేటీ కావడం అతిపెద్ద సర్‌ప్రైజ్. ఈ భేటి ఏపీ, తెలంగాణ రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.
కేసీఆర్‌తో పవర్‌స్టార్‌కి ఇంతకుముందు ప్రత్యేకమైన స్నేహబంధం లేదు. గత ఎన్నికల సమయంలోనూ, ఆ తర్వాత కూడా కేసీఆర్ పార్టీకి వ్యతిరేకంగానే ప్రచారం చేశారు పవర్‌స్టార్. ఐతే ఇపుడు సడెన్‌గా కలవడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా? అసలు పవన్ కల్యాణ్ కేసీఆర్‌ని ఎందుకు కలిశారు? అసలు రీజన్ ఏంటి
సోమవారం సాయంత్రం నుంచే వీరి భేటి గురించి రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన ..తెలంగాణ రాష్ట్ర సమితితో జతకడుతుందనేది మొదటి ప్రచారం. త్వరలో విడుదల కాబోతున్న తన అజ్ఞాతవాసి ప్రీమియర్ షోలకి అనుమతి ఇవ్వాల్సిందిగా కేసీఆర్‌ని కోరినట్లు. మరో ప్రచారం కూడా మొదలైంది. తెలుగుసినిమా.కామ్‌కి తెలిసిన ప్రచారం ప్రకారం ఈ రెండూ పూర్తిగా నిరాధారమైనవే. జనసేన అధినేత పవర్‌స్టార్, సీఎం కేసీఆర్ మధ్య పొత్తుల గురించి ఎటువంటి చర్చ జరగలేదు. ఆ ఆలోచన పవర్‌స్టార్‌కి అస్సలు లేదని జనసేన వర్గాలు అంటున్నాయి. ఇక తన సినిమాలని చూడాలిని తన అభిమానులను కూడా కోరని పవర్‌స్టార్... ప్రీమియర్ షోల అనుమతి కోసం కేసీఆర్‌ని కలుస్తారనుకోవడం కన్నా హాస్యస్పదమైన అంశం మరోటి ఉండదు. ప్రీమియర్ షోల అనుమతి కావాలంటే నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్‌రాజు చూసుకుంటారు దానికి పవర్‌స్టార్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలా ప్రచారం చేయడం అంటే పవర్‌స్టార్ స్థాయిని, వ్యక్తిత్వాన్ని తగ్గించే దురాలోచన తప్ప మరోటి కాదు అని చెప్పాలి.
ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఉన్న ఎమోషనల్ టైమ్‌లో పవన్‌కల్యాణ్.. ఏపీలో తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి మద్దతుగా నిలిచారు. ఆ టైమ్‌లో పవర్‌స్టార్ కేసీఆర్‌కి వ్యతిరేక వైఖరిని చూపిన మాట వాస్తవమే. కానీ మూడేళ్ల తర్వాత అప్పటి ఎమోషనల్ సిచ్యువేషన్ ఇపుడు లేదు. రెండు వైపులా అందరూ సర్దుకున్నారు. ఆంధ్రోళ్ల గురించి ఎన్నో విమర్శలు చేసిన కేసీఆర్ కూడా తెలంగాణ ఏర్పాటు తర్వాత తన వైఖరిని మార్చుకున్నారు. తెలంగాణ రాజకీయ నాయకత్వ పరిణతిని ఇంతకముందు రెండు, మూడు సందర్భాల్లో పవర్‌స్టార్ మెచ్చుకున్నారు. ఇపుడు తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ని అమలు చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని కేసీఆర్‌ని అభినందించేందుకు వెళ్లారు పవర్‌స్టార్.
తెలంగాణ, ఏపీలకి సంబంధించిన రాజకీయ పరిస్థితులపై కూడా ఇద్దరూ చర్చించుకున్నట్లు సమాచారం. ఐతే, వీరి భేటి వెనుక ప్రత్యేక వ్యూహం ఏమీ లేదట.
- Log in to post comments