ఆ విష‌యం ప‌వ‌న్ చెప్ప‌లేదేంటి?

Will Pawan Kalyan continue in films or not?
Wednesday, December 20, 2017 - 18:45

పవన్ కెరీర్ పై ఇప్పుడు భారీ చర్చ నడుస్తోంది. పవర్ స్టార్ సినిమాల నుంచి తప్పుకుంటాడా.. లేక అజ్ఞాతవాసి తర్వాత తన 26వ సినిమాను ప్రకటిస్తాడా..? ఫిలింనగర్ లో అందరి ఆలోచనలు ఈ దిశగానే సాగుతున్నాయి.

తాజాగా జరిగిన ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో పవన్ నిర్ణయం వెల్లడిస్తాడని అంతా ఎదురుచూశారు. సుదీర్ఘంగా ప్రసంగించడం కోసమే ప్రత్యేక అతిథుల్ని ఆహ్వానించలేదనే ప్రచారం కూడా జరిగింది. కానీ పవన్ ఈసారి కూడా తన కెరీర్ ను ప్రశ్నార్థకంగానే మిగిల్చాడు. నెక్ట్స్ సినిమాపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అలా అని సినిమాల నుంచి తప్పుకుంటానని కూడా చెప్పలేదు.

ఖుషీ తర్వాత మరో 5 సినిమాలు చేసి కెరీర్ చాలిద్దామనుకున్నాడు పవన్. కానీ అభిమానుల కోసం వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు. ఈ విషయాన్ని ఆడియో ఫంక్షన్ లో చెప్పిన పవన్..  మాతృభూమికి ఏదో ఒకటి చేయాలనే తపన తనను నిత్యం వెంటాడుతుందన్నాడు.

మెజారిటీ సెక్షన్ మాత్రం పవన్ సినిమాలవైపే మొగ్గుచూపే అవకాశముందని వాదిస్తోంది. అందులో కొంత నిజం కూడా లేకపోలేదు. ఎందుకంటే అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్ లో కూడా నిర్మాత ఏఏం రత్నం కనిపించారు. గతంలో ఈ నిర్మాత సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు పవన్. లెక్క ప్రకారం  ఏఎం రత్నం నిర్మాతగా ఓ సినిమా చేయాలి.  ఆ సినిమా ఆగిపోయిందనుకున్నారంతా. కానీ అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్ లో రత్నం మళ్లీ కనిపించడంతో.. పవన్ సినిమాల్లో కొనసాగుతాడనే ఫ్యాన్స్ భరోసాగా ఉన్నారు.