బండ్ల గణేష్ అను ఓ చేపల కృష్ణ కథ

Bandla Ganesh gets no ticket from Congress party
Monday, November 19, 2018 - 07:30

ఇరవయ్యేళ్ళ కిందట వచ్చిన ‘సముద్రం’ అనే సినిమా గుర్తుందా..?   ఫిల్మ్‌ల‌వ‌ర్స్‌కి అందులో విలన్ క్యారెక్టర్ బాగా గుర్తుండిపోతుంది. అదే – చేపల కృష్ణ.

తనికెళ్ళ భరణి చేశారు చేప‌ల కృష్ణ పాత్ర‌ని. ఆ విలన్ పాత్రకీ - నటుడు కమ్ నిర్మాత కమ్ కోడిగుడ్ల వ్యాపారి కమ్ రియల్టర్ కమ్ తాజా పొలిటీషియన్ బండ్ల గణేష్ కి ఏమిటీ లింక్ అంటారా? ఆ సినిమాలో చేపల కృష్ణకు ఎలాగైనా అసెంబ్లీకి వెళ్ళి ‘అధ్యచ్చా...’ అనాలని కోరిక. అది రీల్ లైఫ్ లో. రియల్ లైఫ్ లో బండ్ల గణేష్ కి కూడా ప్రజా ప్రతినిధిగా అసెంబ్లీకి వెళ్లాలనే తపన ఉంది. అందుకే ‘బండ్ల గణేష్ అను నేను...’ అని ప్రమాణ స్వీకారం ప్రాక్టీస్ కూడా చేశారు. ఒక టీవీ ఛానెల్‌లో ఇప్ప‌టికే అది అనేశారు బండ్ల‌.

ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీ దగ్గర కాంగ్రెస్ కండువా కప్పించుకున్న మరుక్షణం నుంచి తాను ఎమ్మెల్యే అయినట్టే అని గణేష్ భావించారు. అందుకే టీవీ గొట్టాల ముందు కాంగ్రెస్ అధికరంలోకి రావడం ఖాయం, తాను అసెంబ్లీకి వెళ్ళడం గ్యారంటీ అనుకున్నారు. ఆయన జూబ్లీ హిల్స్, రాజేంద్ర నగర్ స్థానాలలో ఎక్కడో ఒక చోట టికెట్ దక్కుతుంది అనుకున్నారు. లేదంటే తమ పౌల్ట్రీ వ్యాపారం ఉన్న షాద్ నగర్ నుంచైనా పోటీ చేసే ఛాన్స్ వస్తుందని ఆశించారు. ఆ ఆశల పల్లకీలోనే మీడియా ముందు ఫుల్ లెంగ్త్ ఇంటర్వ్యూలు విత్ కామెడీ ఇచ్చారు. టీఆర్ఎస్ ను తనదైన రీతిలో విమర్శించి... రాహుల్ ఓ శక్తిమాన్ అన్నట్టు... ఉత్తమ్ ఓ బాహుబలి అని కీర్తించారు. 

తీరా మహాకూటమి లిస్ట్ వచ్చేసరికి బండ్ల గణేష్ గుండెల్లో బండ పడినట్లు అయ్యిందని ఫిల్మ్ నగర్ జనాలు జాలి చూపుతున్నారు. జూబ్లీ హిల్స్ విష్ణువర్ధన్ రెడ్డికి కాంగ్రెస్, రాజేంద్ర నగర్ ను గణేష్ గుప్తాకి టీడీపీ వాళ్ళు ఇచ్చుకున్నారు. ఇక షాద్ నగర్ లో ఎప్పటినుంచో కాంగ్రెస్ లోనే ఉన్న ప్రతాప్ రెడ్డికే కట్టబెట్టారు. ఆ త‌ర్వాత లిస్ట్‌లో వ‌స్తుంద‌ని నిన్న‌టి వ‌ర‌కు ఆశ‌ల‌ప‌ల్ల‌కీలో ఊరేగిన గ‌ణేష్‌కి ఇపుడు ఫుల్ క్లారిటీ వ‌చ్చింది. ఫైన‌ల్‌ లిస్ట్‌లోనూ ఆయ‌న పేరు లేదు. 

కాంగ్రెస్ వాళ్ళను అడిగితే టికెట్ హామీ ఏమీ లేదే... ఆయనకు మా పార్టీ అంటే అభిమానం అన్నాడని చేర్చుకున్నాం... సేవ చేస్తాడు అని చెబుతున్నారు. ఇక గణేష్ ఇంట్లోను, టీవిల ముందు చేసిన ‘బండ్ల గణేష్ అను నేను...’ ప్రమాణ స్వీకారం ఓ కామెడీ షోగా మిగిలిపోయినట్లేనా?

"సముద్రం" సినిమా పోయినా... ‘అధ్యచ్చా..’ అన్న భరణికి బెస్ట్ విలన్ గా నంది అయినా దక్కింది మరి ఈ ఎన్నికల వేళ బోలెడంత కష్టపడుతున్న గణేష్ కి ఏమి దక్కుతుందో?