‘ఎన్టీఆర్’లో దుష్ట కాంగీ ఉంటుందా?

NTR Biopic to go soft on Congress?
Thursday, November 1, 2018 - 23:00

తెలుగువారి ఆత్మ గౌరవ నినాదంతో ప్రజల్లోకి వచ్చి ఢిల్లీ పీఠంపై ఉన్న కాంగ్రెస్స్ వెన్నులో వణుకు పుట్టించిన మహా నాయకుడు నందమూరి తారక రామారావు. ఆయన బయోపిక్‌ని రెండు భాగాలుగా తెర‌కెక్కిస్తున్నారు. రెండో భాగం అంతా మహా నాయకుడిగా ఎదిగిన వైనం, తెలుగువారి ఆత్మ గౌరవం నిలిపిన తీరుని చూపిస్తారు అని ముందు నుంచీ ప్రేక్షక లోకమే కాదు చిత్ర సీమ అంతా ఫిక్స్ అయిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు ‘ఎన్టీఆర్’ బయో పిక్ మీద ప్రభావం చూపిస్తాయా? ఎన్టీఆర్ తెలుగువారికి విలన్ గా భావించిన కాంగ్రెస్స్ పార్టీని ఈ బయో పిక్ లో ఎలా చూపిస్తారు అనే చర్చ మొదలైంది.

నందమూరి తారక రాముడు ఏ రాజకీయ వేదిక నుంచైనా ‘దుష్ట కాంగీ’ అంటూ విరుచుకుపడేవారు. ఆయన కాంగ్రెస్స్ ని కాంగీ అని, ఆ పార్టీవాళ్ళని కాంగేయులు అని చాలా తక్కువ భావం వచ్చేలా సంబోధించేవారు. కాంగీ, కాంగేయులు అనే మాటల్ని మీడియా కూడా వాడేసేది. 

ఎన్టీఆర్ కి నాదెండ్ల వెన్నుపోటు ఎపిసోడ్ లో ఇందిరా గాంధీ హస్తం ఉండటం, నాటి గవర్నర్ రామ్ లాల్ కాంగ్రెస్స్ ఏజెంట్ లా వ్యవహరించడం బహిరంగ రహస్యమే. ఢిల్లీ కుట్రలు తిప్పికొట్టడంలో టీడీపీ ఘన విజయం సాధించింది. దేశవ్యాప్తంగా ఎన్టీఆర్ మహా నాయకుడయ్యారు. రాజీవ్ గాంధీ కూడా ఎన్టీఆర్ ను ఎన్నో ఇబ్బందులుపెట్టారు. కాంగ్రెస్స్ కు వ్యతిరేకంగానే జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ కు ఊపిరిపోశారు పెద్దాయన.

నరనరానా కాంగ్రెస్ వ్యతిరేకత ఉన్న నాయకుడు ఎన్టీఆర్. ఆయన స్థాపించిన పార్టీ ఇప్పుడు హస్తినలో ఇందిరా గాంధీ మనవడు, రాజీవ్ కొడుకు రాహుల్ తో ఇప్పుడు దోస్త్ మేరా దోస్త్ అంటూ కొత్త పల్లవి అందుకొంది. పైగా ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు ‘గతం గతః’ అని ప్రకటించేశారు. అంటే ఎన్టీఆర్ చూపించిన శతృత్వానికి నారా వారు నీళ్ళు వదిలేసి స్నేహ హస్తం చాచారాన్నమాట. ఈ పరిస్థితుల్లో ఎన్టీఆర్ బయో పిక్ లో ఇందిరా, రాజీవ్ లను విలన్ లుగా చూపిస్తే కొత్త స్నేహితుడు నొచ్చుకుంటాడు అనుకొంటే ఆ ఎపిసోడ్ లకు మొత్తం కత్తెర పడుతుంది. లేదంటే ఇందిరా గాంధీని కూడా సాఫ్ట్ గా చూపిస్తారేమో? ఏమో ఏదైనా జరగవచ్చు ఎన్టీఆర్ బయో పిక్ లో... తెలుగు రాజకీయాల్లాగే!